పసుపు బోర్డు రచ్చ : ఎంపీ అరవింద్ కి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరో సవాల్....

By AN TeluguFirst Published Sep 7, 2021, 12:42 PM IST
Highlights

పసుపు బోర్డు తీసుకొస్తామన్న విషయంలో మాట మరచి ఇంకా ఎంపీగా ఉన్నందుకు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. నీ రాజీనామా ఎప్పుడు అని ట్విట్టర్ ద్వారా ఆయనకు గుర్తు చేశారు.

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కి ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మరో సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లాకు ఆక్సిడెంటల్ ఎంపీ గా గెలిచిన 'ఆ'ధర్మపురి అర్వింద్ గారికి తను రాసి ఇచ్చిన బాండ్ పేపర్ నేటికీ 899 రోజులు పూర్తి చేసుకుంది అని గుర్తు చేశారు.

పసుపు బోర్డు తీసుకొస్తామన్న విషయంలో మాట మరచి ఇంకా ఎంపీగా ఉన్నందుకు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. నీ రాజీనామా ఎప్పుడు అని ట్విట్టర్ ద్వారా ఆయనకు గుర్తు చేశారు.

కాగా, బిజెపి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కు పసుపు బోర్డు సెగ తగులుతోంది. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు.  పసుపు బోర్డు సాధించలేని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి రాజీనామా చేసి రైతుల పక్షాన పోరాడాలని రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు.

నిజామాబాద్ లో పసుపు బోర్డు సాధించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరాడుతానని రాతపూర్వకంగా రైతులకు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచి రెండేళ్లు పూర్తయిన తర్వాత  పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం  తెలంగాణ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని స్పష్టంగా ప్రకటించిందని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో లక్షా 40 వేల ఎకరాల్లో పసుపు సాగు అవుతున్నదని, రైతులు ఎగుమతి చేయగలిగే నాణ్యమైన పసుపు పండిస్తున్నారని, మద్దతు ధర లభించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు మద్దతు ధర గ్యారంటీ ఉంటుందని భావిస్తున్నారని చెప్పారు. 

కానీ కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించిందని అన్నారు. తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకో లేకపోయిన ధర్మపురి అరవింద్ తన పదవికి రాజీనామా చేసి రైతుల పక్షాన పోరాడాలని ఆయన డిమాండ్ చేశారు.

click me!