
KTR, Harish Rao inaugurate slaughter house: సిద్దిపేట సమీపంలోని ఇర్కోడ్ గ్రామంలో నిర్మించిన అధునాతన స్లాటర్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావులు కలిసి గురువారం ప్రారంభించారు. రూ.6 కోట్లతో ఈ స్లాటర్ హౌస్ ను నిర్మించారు. స్లాటర్ హౌస్ వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన ఆహారం, ఊరగాయ స్టాల్ ను ఇద్దరు మంత్రులు సందర్శించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల ఆలయం వద్ద సీసీ, బీటీ రోడ్లకు కేటీఆర్, హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
రూ.20 కోట్లతో రోడ్లు వేయనున్నారు. అనంతరం నర్సాపూర్ లోని కప్పలకుంట చెరువు సుందరీకరణకు శంకుస్థాపన చేశారు. రూ.3.33 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. నాగులబండలో సిద్దిపేట ఐటీ టవర్ ను ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగ సభలో కేటీఆర్, హరీశ్ రావు ప్రసంగిస్తారు. మెదక్ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వి.రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేపథ్యంలో నేడు పల్లె ప్రగతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్.. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై ప్రశంసలు కురిపించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని సాకారం చేశారంటూ కొనియాడారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న.. మహాత్మా గాంధీ ఆశయమే స్ఫూర్తిగా గ్రామస్వరాజ్యానికి బాటలువేశారు.. పల్లెప్రగతి’కి ప్రాణం పోశారన్నారు.