అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు పోటెత్తే అవకాశం... అదనపు ఏర్పాట్లకు మంత్రి ఆదేశం

By Arun Kumar P  |  First Published Apr 14, 2023, 1:10 PM IST

హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 


హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటుచేసిన అద్భుత అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కోట్లు ఖర్చుచేసి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని అంతే అట్టహాసంగా ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విగ్రహ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాల కాంతుల్లో అంబేద్కర్ విగ్రహం సరికొత్త అందాలను సంతరించుకుంది. రంగురంగుల పూలతో అంబేద్కర్ స్మతివనాన్ని మరింత అందంగా మార్చారు. 

అంబేద్కర్ విగ్రహావిష్కణ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినా ఇవి సరిపోయేలా లేవని అన్నారు. తెలంగాణ నుండే కాదు వివిధ రాష్ట్రాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం వుందని... వేదిక సరిపోయేలా లేదని భావించిన మంత్రి అదనంగా మరికొన్ని టెంట్లు వేయాలని సూచించారు. ఇవాళ ఇక్కడకు స్వచ్ఛందగా  వచ్చే ప్రజలను చూస్తుంటే కరీంనగర్ లో టీఆర్ఎస్ మొదటి సభ గుర్తుకు వస్తోందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

Latest Videos

దేశంలోని మహారాష్ట్ర, హర్యానా, ఎంపీ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ పట్ల చూపిస్తున్నా ఆదరణ చూస్తుంటే తెలంగాణ మలి దశ ఉద్యమం కాలం గుర్తుకు వస్తోందన్నారు మంత్రి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో తెలంగాణ ఖ్యాతి దేశంలో మరింత పెరిగిందన్నారు.  చాలా రాష్ట్రాల ప్రజలు అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు హైదరాబాద్ కు వస్తున్నారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

Read More  అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు హైదరాబాద్ లో ఘనస్వాగతం...

ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తున్నారని... అందులో ఒకటి ఈ అద్భుత అంబేద్కర్ విగ్రహమని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఏ పని తలపెట్టినా అది పూర్తయిన తర్వాతే ఫలితం తెలుస్తుందన్నారు. తనను ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

అంబేద్కర్ విగ్రహాన్ని కనులారా వీక్షించేందుకు గురువారం రాత్రి మహారాష్ట్ర అకోలా పట్టణం నుండి మహిళలు తరలివచ్చారని మంత్రి తెలిపారు. వారికి సోమాజిగూడ జయ గార్డెన్స్ లో రాత్రి బస  ఏర్పాట్లు చేసామన్నారు. 

click me!