హైదరాబాద్‌లో తలసాని సుడిగాలి పర్యటన, దగ్గరుండి సహాయక చర్యలు

By Siva KodatiFirst Published Oct 14, 2020, 4:42 PM IST
Highlights

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇండ్లలోనే ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం తలసాని , మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్, వివిధ శాఖల అధికారులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు.

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇండ్లలోనే ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం తలసాని , మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్, వివిధ శాఖల అధికారులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు.

అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని ఉన్న మూసారాం బాగ్ వంతెన వరద నీటితో పాక్షికంగా దెబ్బతినడంతో పాటు వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. తక్షణమే ఈ వంతెన పై రాకపోకలు నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అనంతంరం బేగంపేట లోని ప్రకాష్ నగర్ లో వరదనీరు పెద్ద ఎత్తున నిలిచిపోయి ఇండ్లలోకి చేరడంతో ఆప్రాంతాన్ని తలసాని పరిశీలించారు. వెంటనే 2 బోట్లను తెప్పించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావానికి గురైన వారిని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

 

 

తక్షణమే ఆహారం, త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి ఉప్పల్ పెద్ద చెరువు వద్ద రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఒకవైపు రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో మంత్రి ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి వెంటనే ప్రోక్లెయిన్ లను తెప్పించి వరద నీటిని పక్కనే ఉన్న నాలాలోకి తరలించే పనులను చేపట్టారు. వరద నీటి తరలింపు, వాహనాల రాకపోకల పునరుద్దరణ ను స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తో కలిసి శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు.

అనంతరం మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్ లోని నాలాలో జేసిబితో పూడిక తొలగించే పనులను పర్యవేక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్ధితి దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 14, 15 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించిందని మంత్రి వివరించారు.

 

 

ప్రభుత్వం అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్ధితులను సమీక్షిస్తూ తగు ఆదేశాలను జారీ చేస్తుందని తలసాని భరోసా ఇచ్చారు. ప్రజలు పరిస్థితులను అర్ధం చేసుకొని ఈ రెండు రోజులపాటు ఇండ్లలోనే ఉండాలని మంత్రి కోరారు. ప్రజలు అత్యవసర సేవల కోసం జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.

హెల్ప్ లైన్ కు వచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందితో పర్యవేక్షణ జరుపుతూ సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

click me!