
తెలంగాణలో గత కొంతకాలంగా రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదు అని గవర్నర్ చెప్పటం సరికాదన్నారు. బుధవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించటం సరికాదని అన్నారు.
గవర్నర్‌తో ప్రభుత్వానికి కంటిన్యూస్‌గా పని ఉండదని.. ముఖ్యమంత్రితో పనిచేయడం ఇష్టం లేదు గవర్నర్ మాట్లాడటం సరికాదని చెప్పారు. రాజ్యంగంలో ఎవరి విధులు ఏ విధంగా ఉండాలనేది స్పష్టంగా తెలియజేశారని.. ఆ విషయాన్ని విస్మరించి ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. ఒక మహిళగా ఎంత గౌరవం ఇవ్వాలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. గవర్నర్ రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శిచిన తలసాని.. అది కరెక్ట్ కాదని అన్నారు. . తమది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం అని.. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
‘‘దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ రోల్ తక్కువ ఉంటుందని.. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి’’ అని తలసాని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి అన్నారని... అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు.
రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏమిటని మంత్రి తలసాని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని పాట లేదని మండిపడ్డారు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో జరిగే ప్రచారం తప్ప వేరే లేదని అన్నారు.
ఇక, మంగళవారం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కలిసి పని చేయడం కష్టమని అన్నారు. తాను ఇద్దరు వేర్వేరు ముఖ్యమంత్రులతో పని చేస్తున్నానని తెలిపారు. రెండూ రాష్ట్రాల్లో విధులు చాలా భిన్నమైనవని అన్నారు. ఇప్పుడు తాను వారితో కలిసి పని చేశానని ఇక ఇతర ముఖ్యమంత్రులతో కూడా పని చేయగలనని తనకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకం చేయడానికి తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ను కదని అన్నారు. రాజకీయంలో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారని.. ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ గా ఎవరున్నా కూడా ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.రాజ్ భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదన్నారు. ఏ విబేధాలున్నా చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై చెప్పారు. సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణను చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.