వ్యవస్థలు రేపు మా చేతుల్లోకీ రావొచ్చు.. మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై తలసాని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 22, 2022, 4:17 PM IST
Highlights

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ , ఈడీ దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈరోజు ఈ వ్యవస్థలు మీ చేతిలో వుండొచ్చని, రేపు మా చేతుల్లోకి రావొచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులకు భయపడితే తాము హైదరాబాద్‌లో ఎందుకు వుంటామని తలసాని ప్రశ్నించారు. 

మంత్రి మల్లారెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలపై వరుసపెట్టి జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఈ దాడులు జరుగుతాయని తమకు ముందే తెలుసునని, సీఎం కేసీఆర్ కూడా ముందే చెప్పారని తలసాని పేర్కొన్నారు. ఈ దాడులను ధీటుగా ఎదుర్కొంటామని.. ఈరోజు ఈ వ్యవస్థలు మీ చేతిలో వుండొచ్చని, రేపు మా చేతుల్లోకి రావొచ్చునని తలసాని జోస్యం చెప్పారు. టార్గెట్ చేసి కక్షపూరితంగా దాడులు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇలాంటి దాడులకు భయపడితే తాము హైదరాబాద్‌లో ఎందుకు వుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని... ఈ విషయాలను వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.     

కాగా... మంత్రి  మల్లారెడ్డి ఇంట్లో  మంగళవారం ఉదయం నుండి  ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు.  మల్లారెడ్,  ఆయన  సోదరుడు  గోపాల్ రెడ్డి,  అల్లుడు  రాజశేఖర్ రెడ్డి , కొడుకులు  మహేందర్ రెడ్డి,  భద్రారెడ్డి, వియ్యంకుడు  లక్ష్మారెడ్డి  ఇళ్లలోనూ ఐటీ సోదాలు  కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి  కుటుంబానికి  చెందిన  14  విద్యాసంస్థల్లో  కూడా  ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి ఫోన్ ను   ఐటీ  అధికారులు  స్వాధీనం  చేసుకున్నారు. తన  నివాసం  పక్కనే  ఉన్న  క్వార్టర్  లో  మల్లారెడ్డి పోన్ ను  స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి  సమక్షంలోనే ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు. 

Also REad:ఐటీ దాడులు: మంత్రి మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ. 2 కోట్లు సీజ్

ఈ క్రమంలో మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి  ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన నగదును  ఐటీ  అధికారులు  మంగళవారంనాడు  సీజ్  చేశారు. త్రిశూల్ రెడ్డి  పలు కాలేజీలను  నిర్వహిస్తున్నారని సమాచారం. సుచిత్రలో  నివాసం ఉంటున్న  త్రిశూల్  రెడ్డి నరసింహరెడ్డి  కాలేజీల్లో డైరెక్టర్ గా  కొనసాగుతున్నారు. అంతేకాదు  మంత్రి  మల్లారెడ్డి కి  త్రిశూల్  రెడ్డి  సమీప బంధువు.  త్రిశూల్  రెడ్డికి  చెందిన  ఫోన్ ను  కూడా  ఐటీ  అధికారులు సీజ్  చేశారు.  మంత్రి  మల్లారెడ్డికి, త్రిశూల్  రెడ్డికి  మధ్య  సంబంధాలపై  ఐటీ  అధికారులు ఆరా  తీస్తున్నారు. 
 

click me!