మేం ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం.. దమ్ముంటే మీరు చేయండి, ఎన్నికల్లో చూసుకుందాం: బీజేపీ నేతలకు తలసాని సవాల్

By Siva KodatiFirst Published May 27, 2022, 4:25 PM IST
Highlights

సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన  వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి నుంచి టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవరూ భయపడరని అన్నారు టీఆర్ఎస్  నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) . శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సవాల్ విసిరారు. తాము కూడా రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కొడుక్కి బీసీసీఐతో సంబంధం ఏంటని తలసాని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించాలని ఆయన సూచించారు. 

అంతకుముందు నిన్న తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై (trs)  ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. గురివింద గింజ తన కింద నలుపు చూసుకోవాలంటూ చురకలు వేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో (bjp) లేడా ..? మీది కుటుంబ పార్టీ కాదా .. ? అని ఆయన ప్రశ్నించారు. యూపీలో బీజేపీ పొత్తు పెట్టుకున్న అప్నాదళ్ (apna dal) కుటుంబ పార్టీ కాదా అని హరీశ్ రావు నిలదీశారు. పంజాబ్‌లో గతంలో అకాళీదళ్‌తో (shiromani akali dal) అధికారం పంచుకోలేదా.. అది కుటుంబ పార్టీ కాదా అని మంత్రి ప్రశ్నించారు. 

Also Read:మీ తప్పుల్ని ప్రశ్నిస్తే కుటుంబ పార్టీనా.. మేం అధికారం లాక్కోలేదు, ప్రజలే ఇచ్చారు: మోడీకి హరీశ్ రావు కౌంటర్

మీ తప్పులు ఎత్తిచూపితే కుటుంబ పార్టీ అంటారని హరీశ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదని, తెలంగాణయే ఓ కుటుంబం అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్నే కుటుంబంగా భావిస్తూ పరిపాలించే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అధికారం లాక్కుంటే రాలేదని.. తమకు ప్రజలే ఇచ్చారని హరీశ్ రావు చురకలు వేశారు. భారత రాజ్యాంగం ప్రకారం తాము నడుచుకుంటామని మంత్రి అన్నారు. కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోడీ మాట్లాడటం సిగ్గు చేటుగా వుందన్నారు. 

అటు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy) కూడా కౌంటరిచ్చారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఇచ్చిందేమీ లేకపోగా తెలంగాణపైనే విషం కక్కి వెళ్లిపోయారని అన్నారు. ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పారన్నారు. తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని... మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని పల్లా ప్రశ్నించారు. 

తెలంగాణ ఐటీఐఆర్ ను రద్దు చేసిన చరిత్ర మోడీది అని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీ లో కలిపి ఇబ్బంది పెట్టారన్నారు. ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేయడమే కాదు లక్షల కోట్ల అప్పులు చేసి భారం మోపుతున్నారని ఆరోపించారు. వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా వుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణ సాకుతోందని పల్లా పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయాన్ని కట్టుకుంటున్నామని పల్లా పేర్కొన్నారు.
 

click me!