ఫాంహౌస్ ఫైల్స్ ఫెయిలా... దొరికిన ఆడియో, వీడియోలు అబద్ధమా : కిషన్ రెడ్డికి తలసాని కౌంటర్

By Siva KodatiFirst Published Dec 28, 2022, 4:51 PM IST
Highlights

బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి సంబంధం లేదంటూనే కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అవసరం లేదు.. సికింద్రాబాద్‌కైనా ఏం తెచ్చారో చెప్పాలని తలసాని చురకలంటించారు. కనిపించినప్పుడల్లా కిషన్ రెడ్డి రాజకీయాలే మాట్లాడతారా అని మంత్రి ప్రశ్నించారు. ఫాంహౌస్ ఫైల్స్ ఫెయిల్ అంటున్నారని.. దర్యాప్తు సంస్థలపై మీకున్న చిన్నచూపు అర్ధమవుతోందని తలసాని దుయ్యబట్టారు. 

కిషన్ రెడ్డి విమర్శల్లో కాకుండా.. అభివృద్ధిపై పోటీ పడాలని మంత్రి హితవు పలికారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి సంబంధం లేదంటూనే... ఇంకో వైపు వాళ్లే కోర్టుకు వెళ్లారని తలసాని ఎద్దేవా చేశారు. మరోవైపు సంబరాలు చేసుకుంటున్నారని.. సంబరాలు చేసుకోవడానికి కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చిందా అని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. దొరికిన ఆడియో, వీడియోలు అబద్ధమా అని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. 

ALso REad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు నార్కో, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా : కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఇకపోతే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్ట్‌లకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు  కేసులో దొంగల ముసుగులు తొలగాయన్నారు. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సంబంధం లేదన్నవారే దొంగలను భుజాలపై మోస్తున్నారని మంత్రి ఆరోపించారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్ రెడ్డికి సంబరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబరాలు చేసుకోవడం వెనుక మర్మమేంటని ఆయన నిలదీశారు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటికొస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారని.. నేరం చేసినవాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టిలో మరల్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడటం , కొత్త కథలు చెప్పడం , కొత్త కొత్త నటులతో కొత్త సినిమాలు తీయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు . పాలనను గాలికొదిలేసి, తన అస్ధిత్వాన్ని కాపాడుకునేందుకు ఇతరుల మీద బురద జల్లడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. రాష్ట్రంలో అనేక సందర్భాలలో , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన న్యాయస్థానాలు సుమోటాగా తీసుకుని మొట్టికాయలు కొట్టిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చివరికి రాష్ట్రంలో ప్రజలు తమ నిరసన తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఇందిరా పార్క్ దగ్గర  ధర్నాలు చేయరాదని బీఆర్ఎస్ ప్రభుత్వం హుకుం జారీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు మండిపడిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

click me!