
ఆంధ్రప్రదేశ్ మంత్రులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏమీ చదువుకోనివారిని మంత్రులను చేశారని ఆయన ఆరోపించారు. కనీస అవగాహన లేని వారికి ఏపీలో అక్కడి ముఖ్యమంత్రి మంత్రి పదవులను ఇచ్చారని.. కానీ తెలంగాణలో మాత్రం అన్ని అంశాలపై పట్టున్నవారికే కేసీఆర్ మంత్రి పదవులను ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇక అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు సైన్యం ఉందన్నారు. చావడానికైనా, చంపడానికైనా సిద్దమేనని చెప్పారు.జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ను రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎవరి బెదిరింపులకు తాము భయపడబోమని మంత్రి చెప్పారు.
ALso REad: కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆరే సీఎం:మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇదిలావుండగా.. టీఆర్ఎస్, వైఎస్ఆర్‌టీపీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. తన పోరాటానికి మద్దతిచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొండా సురేఖలకు షర్మిల ధన్యవాదాలు చెప్పారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై టీఆర్ఎస్ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
ఢిల్లీ వెళ్లిన సమయంలో వైఎస్ షర్మిల బీజేపీ నేతలను కలిసి వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొద్దిరోజుల క్రితం ఆరోపించారు. ఆడబిడ్డ అని ఇప్పటివరకు ఓపిక పట్టామన్నారు. సుదర్శన్ రెడ్డిని మగడివా అని విమర్శించడంతో ఆయన అనుచరవర్గం ఆగ్రహనికి షర్మిల గురైందని ఆయన చెప్పారు. తెలంగాణలో జరిగే అభివృద్దిని చూసి ఓర్వలేక దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని షర్మిలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.