రబ్బర్ బుల్లెట్లే అని చెప్పా... విపక్షాలది కక్కుర్తి రాజకీయం : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Aug 14, 2022, 5:57 PM IST
Highlights

ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీ కాల్పులకు సంబంధించి విపక్షాలు చేస్తోన్న విమర్శలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని .. అయినప్పటికీ విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఫైర్ అయ్యారు. 
 

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ (minister srinivas goud) తుపాకీ కాల్పుల (gun firing) వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందించారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. ఏ ఘటన జరిగినా విచారణ వుంటుందని.. కానీ తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశవ్యాప్తంగా 52 శాతంపైగా బీసీ జనాభా వున్న నేపథ్యంలో కేంద్రం బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై అనేక అంశాలపై శాసనసభలో తీర్మానాలు చేసి పంపినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలనే ధ్యాస తప్పించి బీజేపీ మరో పనిలేదని ఆయన చురకలు వేశారు. 

Also Read:మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెక్యూరిటీ వద్ద రబ్బరు బుల్లెట్లా?, కేసు పెట్టాలి: రఘునందన్ రావు

కాగా.. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఫ్రీడమ్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించే  సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరింగ్ చేశారు. ఈ విషయమై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. తాను ఉపయోగించిన తుపాకీలో రబ్బరు బుల్లెట్లున్నాయన్నారు. స్పోర్ట్స్  మీట్ ను ప్రారంభంలో ఇలా కాల్పులు జరపడం సాధారణమేనని ఆయన చెప్పారు.

మరోవైపు.. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే తాము హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వ్యక్తిగత సిబ్బంది నుండి బుల్లెట్లు లోడ్ అయిన ఆయుధాన్ని తీసుకొని గాల్లోకి కాల్పులు జరపడాన్ని తప్పు బట్టారు ఇండియన్ ఆర్మ్ యాక్ట్ ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరిపే సమయంలో పొరపాటున మిస్ ఫైర్ అయితే  అక్కడే ఉన్న ప్రజలపైకో లేదా ఎస్పీ, కలెక్టర్లతో పాటు అధికారులపైకి బుల్లెట్లు దూసుకు వస్తే ఏం చేసేవారని ఆయన ప్రశ్నించారు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా ప్రైవేట్ వ్యక్తులకు తుపాకీ ఇచ్చి ఫైరింగ్ చేయమని ఎక్కడ ఉందో చెప్పాలని డీజీపీని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.  

click me!