రాజ్ భవన్ నుంచి ఎలాంటి లేఖ రాలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తెరపైకి మరో కొత్త వివాదం..!

By Sumanth KanukulaFirst Published Nov 8, 2022, 3:08 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,  రాజ్‌భవన్‌కు మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు-2022పై వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,  రాజ్‌భవన్‌కు మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు-2022పై వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి గవర్నర్ తమిళి సై లేఖ రాశారు. ఈ బిల్లుపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు రావాలని సూచించారు. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వాలని గవర్నర్‌ కోరుతున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి.. రాజ్ భవన్ నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని స్పష్టం చేశారు. 

యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురించి గవర్నర్ లేఖ రాశారని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే తాను చూశానని సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. రేపు ఉదయం నిజాం కాలేజీ హాస్టల్ సమస్యపై ఉన్నత విద్యాశాఖాధికారులతో సమావేశం కానున్నట్లు సబిత చెప్పారు. ఇక, తమకు గవర్నర్ నుంచి ఎలాంటి లేఖ అందలేదని విద్యాశాఖ కార్యాలయం చెబుతోంది. దీంతో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 

ఇక, ఇదే అంశంలో యూజీసీకి కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. యూనివర్సిటీల్లో ఖాళీలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం చెల్లుబాటు అవుతుందా ?  కాదా ?  అనే దానిపై ఆమె యూజీసీ అభిప్రాయం కోరారు. 

అయితే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు కూడా గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఈ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో ఒకదానిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగడం, యూజీసీ అభిప్రాయం కోరడం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,  రాజ్‌భవన్‌కు మధ్య మరో కొత్త వివాదం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక,  ‘‘గవర్నర్ ఆ బిల్లులను తిరస్కరించవచ్చు.. వాటిని తిరిగి ప్రభుత్వానికి పంపవచ్చు. కానీ ప్రభుత్వం బిల్లులను తిరిగి పంపినప్పుడు, ఆమె వాటిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని సీఎంవో వర్గాల చెబుతున్నాయి.

ఇక, గతంలో జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్, మెడికల్ స్కామ్, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల వంటి సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై నివేదికలు కోరారు. రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితిపై వివరించడానికి సీనియర్ అధికారులను పంపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే బిల్లుపై వివరణ నిమిత్తం రాష్ట్ర మంత్రిని పంపాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరడం ఇదే తొలిసారి.
 

click me!