ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై పొలిటికల్ హీట్.. అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు..

Published : Nov 08, 2022, 02:29 PM IST
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై పొలిటికల్ హీట్.. అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధాని తెలంగాణ పర్యటనపై రాజకీయ రగడ మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధాని తెలంగాణ పర్యటనపై రాజకీయ రగడ మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ ప్రకటించింది. మరోవైపు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థుల జేఏసీ.. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకు ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తోంది. లేకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటన అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించింది. 

ఇక, యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ తమిళిసై వెంటనే ఆమోదించాలని తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకుంటే.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థుల జేఏసీ హెచ్చరించింది. 

యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై కేంద్రం వైఖరి చెప్పాలని డిమాండ్ చేసింది. బిల్లును తొక్కి పెట్టింది కేంద్రమా..? మోదీనా..? అని ప్రశ్నించింది. దీనిపై ప్రదాని మోదీ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించింది. గుజరాత్‌కు ఓ న్యాయం.. తెలంగాణ విద్యార్థులకో న్యాయమా అని ప్రశ్నించింది. తమకు సమాధానాలు చెప్పకుంటే మోదీ పర్యటన అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించింది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును ఆమోదించి విద్యార్థుల న్యాయం చేయాలని కోరింది. విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్న గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. 

మరోవైపు ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా టీఆర్ఎస్, వామపక్షాలు ఉమ్మడి ఉద్యమ కార్యచరణను సిద్దం చేసుకుంటున్నాయి. వామపక్ష కార్మిక సంఘాలతో టీఆర్ఎస్ కార్మిక సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. ప్రధాని మోదీకి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. దురుద్దేశంతోనే మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. గతేడాది ప్రారంభమైన ఫ్యాకర్టీని ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ  నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ప్రధాని రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ప్రచారం చేస్తామని చెప్పారు. 

ఈ నెల 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపట్టనున్నట్టుగా తెలిపారు. బీజేపీ తమకు ప్రధాన శత్రువు అని అన్నారు. ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుని తీరుతామని చెప్పారు. వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి మోదీ పర్యటనను అడ్డుకుంటామని అన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ కలిసి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ వల్ల పాలన సక్రమంగా జరగట్లేదని విమర్శించారు. గవర్నర్ వెళ్లిపోవాలనే డిమాండ్‌తో త్వరలో రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఇక, గతకొంతకాలగా తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి  తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు దూరంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలను సీఎం కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారైనా ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్ కనిపిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ.. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని పలు సంఘాలు హెచ్చరికలు జారీ చేయడంతో తెలంగాణ రాజకీయాలు మరోమారు వేడేక్కాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్