గోడలకు సున్నాలు వేసుకునేవాడికి రైతుల కష్టాలు తెలుస్తాయా : రేవంత్‌ రెడ్డిపై పువ్వాడ ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 12, 2023, 5:07 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గోడలకు సున్నాలు వేసిన రేవంత్‌కు రైతుల కష్టాలు ఏం తెలుసునని దుయ్యబట్టారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారని పువ్వాడ ప్రశంసించారు.

ఉచిత విద్యుత్‌కు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బుధవారం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం మంచుకొండలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. గోడలకు సున్నాలు వేసిన రేవంత్‌కు రైతుల కష్టాలు ఏం తెలుసునని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు పవన్ ఇస్తే రైతులకు పవర్ కట్ అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందే వాళ్ల కడుపులో ఏం వుందో స్పష్టం అయ్యిందని పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు అందరికీ తెలుసునని.. కేసీఆర్ వచ్చిన తర్వాతే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారని పువ్వాడ ప్రశంసించారు. గతంలో ఎరువుల లారీలు ఎలా లూటీ అయ్యాయని అజయ్ కుమార్ నిలదీశారు. విత్తనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ల మీద చెప్పులు పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కేసీఆర్ రైతు బాంధవుడని, పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే అది ఆయన వల్లేనని పువ్వాడ తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పాతాళంలోకి దిగిపోయిందని.. చంద్రబాబు ఏజెంట్లు ఉత్తర నాయకులు టీపీసీసీ అధ్యక్షులుగా వున్నారంటూ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యలు .. రేవంత్ అలా అనలేదు, బీఆర్ఎస్ వక్రీకరణ, సీఎం అవ్వాలన్న ఆశల్లేవు: సీతక్క

మరోవైపు.. రాష్ట్రంలో సాగుకు ఉచిత విద్యుత్ మూడు గంట‌లు చాలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులను కోరింది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ను వ్యతిరేకించినందుకు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆయ‌న పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. కాంగ్రెస్ తన రైతు వ్యతిరేక విధానాలను మరోసారి బహిర్గతం చేసిందని మండిప‌డ్డారు. తెలంగాణ రైతులు, ప్రజలు కాంగ్రెస్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని బీఆర్‌ఎస్‌ నేత అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనవసరంగా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తోందని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. 


 

click me!