Praja Palana: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగించాలని భావించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
Praja Palana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సాగుతున్న విషయం తెలిసిందే. అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తులను మండల కేంద్రాల్లో ఇవ్వొచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన దరఖాస్తుల గడువుపై కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగించాలని భావించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దరఖాస్తుల స్క్రూటినీ తర్వాత ఆయా పథకాల అమలుపై ప్రభుత్వం ద్రుష్టి సారిస్తుందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసుననీ, దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదువుతున్నారనీ, కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఆదేశించామని తెలిపారు. అయితే.. మాజీ సీఎం కేసీఆర్ ను రక్షించేందుకే బీజేపీ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాపాడేందుకు కిషన్ రెడ్డి నానా తిప్పలు పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల ముందు కేసీఆర్ అవినీతిపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అమిత్ షా, నడ్డా సంచలన కామెంట్లు చేశారని, కానీ, తీరా ఎన్నికల సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదనీ పొన్నం ప్రశ్నించారు. జ్యుడీషియల్ విచారణకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరారు. బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటేననీ, అందుకే.. గోషామాహాల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదనీ, అలాగే.. జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ పై ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల విషయంలో కేసీఆర్ కుటుంబం అనేక తప్పులు చేసిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలనేవి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమేనన్నారు.