TRS Maha Dharna: ధాన్యం కొనుగోలుపై రాష్ట్రాన్ని బదనాం చేయద్దు.. మంత్రి నిరంజన్ రెడ్డి..

By team teluguFirst Published Nov 18, 2021, 1:41 PM IST
Highlights

ధాన్యం కొనుగోలుపై(paddy procurement) కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయకుండా.. రాష్ట్రాన్ని బదనాం చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. 

రాష్ట్ర రైతులకు మేలు కోసమే టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులు ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ నేడు ధర్నాలో కూర్చొన్నారని అన్నారు. కేంద్ర అస్పష్ట విధానాలతో రైతులకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కొనుగోళ్లపై కేంద్రం ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ (Indira park)  టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో ((TRS Maha Darna)  నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ఒప్పందం చేసుకన్న ధాన్యాన్ని కూడా కొనడం లేదన్నారు. తెలంగాణలో రైతు బంధు పథకాలతో రైతులకు ప్రోత్సాహం అందజేస్తుందని అన్నారు. 

ధాన్యం కొనుగోలుపై(paddy procurement) కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయకుండా.. రాష్ట్రాన్ని బదనాం చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని వ్యాఖ్యానించారు. కేంద్రం మనసు మార్చుకోకపోతే పతనం తప్పదని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. 

Also Read: TRS Maha Darna: ఇది ఆరంభం మాత్రమే..అంతం కాదు.. టీఆర్‌ఎస్ మహా ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్

ఇక, మహాధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉందని విమర్శించారు. ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు.  ఉత్తర భారతంలో రైతాంగం చేస్తున్న పోరాటాన్ని కలుపుకుని భవిష్యత్తులో కూడా పోరాటాన్ని ఉధృతం చేయాల్సి ఉంటుందని అన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. వివిధ పోరాట మార్గాల్ని ఎంచుకుని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి.. రైతుల గోసను వివరించారని సీఎం కేసీఆర్ చెప్పారు. పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దండం పెట్టి కోరారని తెలిపారు. తాను కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశానని.. కానీ ఎలాంటి స్పందన లేదని అన్నారు. నిన్న కూడా కేంద్రానికి లేఖ రాసినట్టుగా చెప్పారు. ఈ పోరాటం ఉప్పెనలా కొనసాగించి.. కేంద్రం దిగివచ్చేలా చేద్దామన్నారు. కరెంట్ బావుల వద్ద మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని కోరారు.  

సీఎం ధర్నాలు చేయడమేమిటనీ కొందరు మాట్లాడుతున్నారని..  2006 లో గుజురాత్ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోదీ 51 గంటల పాటు ధర్నాకు కూర్చొలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ధర్నాలు కొనుగోలు చేసే పరిస్థితులు రాష్ట్రాల్లో నెలకొన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.  ఈ పోరాటం ఇక్కడితో ఆగదని... అవసరమైతే దిల్లీకి వెళ్లి.. చేయాల్సి ఉంటుందని అన్నారు.

click me!