
మాటల్లో సామాజిక న్యాయం కాదు.. చేతల్లో సామాజిక న్యాయం పాటించిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ప్రగతి నివేదికను విడుదల చేశారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జీహెచ్ఎంసీ చట్టాన్ని కేసీఆర్ తెచ్చారని గుర్తుచేశారు. రిజర్వేషన్ల ప్రకారం కేటాయించాల్సిన 75 సీట్లకు అదనంగా మరో 10 సీట్లను కేటాయించి మహిళా పక్షపాతిగా కేసీఆర్ నిరూపించుకున్నారని కేటీఆర్ తెలిపారు.
అన్ని కోణాల్లోనూ పరిశీలించి అభ్యర్ధుల ఎంపిక నిర్వహించామని చెప్పారు. బీసీల్లో అందరికీ ప్రాధాన్యత లభించేలా ఎంపిక చేశామన్నారు. 17 సీట్లు మైనారిటీ సీట్లు, 8 స్థానాల్లో ఆంధ్రా సెటిలర్లకు టికెట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు,.
తెలంగాణకు బతుకుదెరువుకు వచ్చిన వారంతా మా బిడ్డలే అని సీఎం కేసీఆర్ చెప్పారన్న సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. గులాబీ సైనికులు దాదాపు 60 లక్షల మంది ఉన్నారని.. ఒక్కో కార్యకర్త 50వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.
వందల మంది కష్టపడితే ఒక్క నాయకుడు వస్తాడని.. అభ్యర్థులు టికెట్ రాని నేతలను కలుపుకొని పోవాలని ఆయన సూచించారు. ఇది అందరి హైదరాబాద్.. అందరికోసం పనిచేసే ప్రభుత్వం. అభ్యర్థులు రేపే బీఫారాలు సమర్పించాలని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్‌లో కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాం. ఆరు నెలల్లో కేశవాపురం రిజర్వాయర్ నీళ్లు అందుబాటులోకి వస్తున్నాయని 2050 వరకు తాగునీటికి కొరత లేకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేఆర్ వెల్లడించారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ టీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందన్నారు.