ఎమ్మెల్యే పదవుల కోసం బాబుకు తెలంగాణను తాకట్టు పెడతారా: కేటీఆర్

By narsimha lodeFirst Published Sep 30, 2018, 5:38 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామన్న టీడీపీ... ఆ పార్టీతో జతకట్టిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామన్న టీడీపీ... ఆ పార్టీతో జతకట్టిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అడుగడుగునా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ అంటకాగడం వల్ల తెలంగాణకు నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఆర్యవైశ్య సంఘం నేతలు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  మంత్రి కేటీఆర్ విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువత చావుకు కారణమైన పార్టీలతో కోదండరామ్ పొత్తు పెట్టుకొంటున్నారని కేటీఆర్ చెప్పారు.కోదండరామ్‌ది అడ్రస్ లేని పార్టీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వంద సీట్లు  వస్తాయని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

చంద్రబాబునాయుడు మద్దతుతో మహాకూటమి ఏర్పాటైతే  మళ్లీ పరాయి పాలన కిందకు పోవాల్సి వస్తోందని కేటీఆర్  అనుమానాలను వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కొన్ని ఎమ్మెల్యే పదవుల కోసం  తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతిలో తాకట్టు పెడతామా అని ఆయన ప్రశ్నించారు. 

60ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెసోళ్లకు తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని విమర్శించారు. చనిపోయిన వాళ్లపేర్ల మీద కేసులు వేసి ప్రాజెక్టులను ఆపేందుకు కుట్రలు చేశారు. మన నీళ్లు మనం తెచ్చుకుంటుంటే మోకాలు అడ్డుపెడుతున్నారని ఆరోపించారు.

click me!