ఐసీయూలో కాంగ్రెస్, అధికారంలోకి వస్తే జనానికి కన్నీళ్లే.. 3 గంటల కరెంట్ గ్యారెంటీ : కేటీఆర్ చురకలు

By Siva Kodati  |  First Published Sep 29, 2023, 7:49 PM IST

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్.  కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ గ్యారెంటీ అని  చివరికి నల్లా నీళ్ల కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్ధితి వస్తుందని మంత్రి జోస్యం చెప్పారు.  


కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. శుక్రవారం వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీవి వారంటీ లేని గ్యారంటీలని , ఆ పార్టీ ప్రస్తుతం ఐసీయూలో వుందని కేటీఆర్ చురకలంటించారు. బీఆర్ఎస్ స్కీములు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ స్కామ్‌లకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ అంటే మైగ్రేషన్, బీఆర్ఎస్ అంటే ఇరిగేషన్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ గ్యారెంటీ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చివరికి నల్లా నీళ్ల కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్ధితి వస్తుందని మంత్రి జోస్యం చెప్పారు. 

ALso Read: ప్లగ్‌లో వేలు పెడితే కరెంట్ వుందో లేదో తెలుస్తుంది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

Latest Videos

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ప్రకటించాలని కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. మోడీకి తెలంగాణ అంటే ఎందుకంత కక్షని ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీలను తక్షణం కేటాయించాలన్నారు. వాల్మీకీ బోయలకు రిజర్వేషన్ కల్పించాలని పలుమార్లు తీర్మానం పంపినా కేంద్రం స్పందించలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని.. కేంద్రంలో మనం వుంటేనే మనకు రావాల్సినవి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. 

పాలమూరు నుంచి 14 లక్షల మంది బిడ్డలు వలసలు పోయారని.. అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంటే హారతులిచ్చింది కాంగ్రెస్ నేతలేనని కేటీఆర్ చురకలంటించారు. కేసీఆర్ వచ్చాకే వనపర్తి జిల్లా అయ్యిందని కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యిందని.. ఐటీఐ, కేజీబీవీ, అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. 65 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామని.. సిరిసిల్ల, సిద్ధిపేటలతో వనపర్తి పోటీపడుతోందని దీనికి కారణం నిరంజన్ రెడ్డేనని కేటీఆర్ ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 

click me!