ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. ఓసారి ఆయన ప్లగ్‌లో వేలుపెట్టి చూస్తే తెలుస్తుందని హరీశ్ రావు సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వదిలేసిన నేతలను కాంగ్రెస్ తీసుకుంటోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారని మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. శుక్రవారం ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్ధులు దొరకడం లేదన్నారు. బీఆర్ఎస్ వదిలేసిన నేతలను కాంగ్రెస్ తీసుకుంటోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కరెంట్ రావడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారని.. ఓసారి ఆయన ప్లగ్‌లో వేలుపెట్టి చూస్తే తెలుస్తుందని హరీశ్ రావు సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు.. ప్రజలకేం గ్యారెంటీలు ఇస్తారని ఆ పార్టీ ఎన్నికల హామీలపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వమే వుందని.. అక్కడేమో రూ.600 ఇచ్చి, తెలంగాణకు వచ్చి రూ.4,000 ఇస్తామనడం చెవిలో పువ్వు పెట్టడమేనంటూ హరీశ్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరుగురు ముఖ్యమంత్రులు మారుతారని, మత కల్లోలాలు వస్తాయని మంత్రి జోస్యం చెప్పారు. తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ALso Read: ఆరడుగుల హైట్ ఉంటే సరిపోదు... ఏం జరుగుతుందో తెలుసుకోవాలి: మంత్రి హరీష్ కు కోమటిరెడ్డి కౌంటర్
అంతకుముందు రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ ను వ్యవసాయానికి ఎక్కడ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ లు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామాల్లోకి వెళ్లి ఈ విషయమై విచారణ చేయాలని ఆయన కోరారు.
ఆరు అడుడుల హైట్ ఉండగానే సరిపోదు.... మీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హరీష్ రావుకు కోమటిరెడ్డి హితవు పలికారు. మా పార్టీలో ఏం జరుగుతుందో మీకెందుకని ఆయన అడిగారు. డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చే చరిత్ర తమ పార్టీలో లేదన్నారు. దళితబంధు, బీసీ బంధులో మీ పార్టీ నేతలు కమీషన్లు తీసుకొంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.