
మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసునని అన్నారు మంత్రి కేటీఆర్. మంగళవారం మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సాధారణంగా ఎమ్మెల్యేలు చనిపోతేనే ఉపఎన్నిక వస్తుందన్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అమ్ముడుపోతే వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. రూ.18 వేల కోట్లకు మునుగోడు ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాకట్టుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు.
నాలుగేళ్లు ఎలాంటి పనిచేయకున్నా.. నియోజకవర్గంలో పర్యటించుకున్నా ధనబలంతో మునుగోడులో గెలవాలని కోమటిరెడ్డి భావిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఇది ప్రజల మీద బలవంతంగా రుద్దిన ఉపఎన్నిక అన్నారు. మోడీ , రాజగోపాల్ రెడ్డిల అహంకారంతోనే మునుగోడులో ఎన్నిక వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు. మోడీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిందని.. అయినా ఆయనలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒకప్పుడు ఉల్లిగడ్డ ధర పెరిగినందుకు కేంద్ర ప్రభుత్వం కూలిపోయిందని.. మరీ ఈనాడు ఉల్లి, పప్పు, చింతపండు ఇలా అన్ని ధరలు పెరిగి ఆకాశాన్ని తాకుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Also REad:ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడ దక్కదు:మంత్రి జగదీష్ రెడ్డి
మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు పెట్రోల్ ధర రూ.70 వుండేదని.. కానీ ఇప్పుడు రూ.110కి చేరిందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని రకాల రేట్లు పెరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ ఫ్లోరైడ్ సమస్యపై కేసీఆర్ పోరాడరని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక ప్రతి ఇంటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో మోడీ వున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
పెద్ద కాంట్రాక్టర్లను ప్రధాని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని.. కేసీఆర్ రాకముందు కరెంట్ ఎలా వుండేది, ఇప్పుడు ఎలా వుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ గట్టున వుంటారా.. ఈ గట్టున వుంటారో తేల్చుకోవాలని మంత్రి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎవరు పెద్దోళ్ల కోసం వున్నారు..? ఎవరు పేదోళ్ల కోసం వున్నారని మంత్రి ప్రశ్నించారు. రైతుబంధు కావాలా..? రాబందు కావాలా అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయినోడు ఇంటింటికి తులం బంగారం ఇస్తాడని మంత్రి ధ్వజమెత్తారు. దొంగలు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.