నేను డాక్టర్ కావాలని మా అమ్మ కోరుకుంది.. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైంది: కేటీఆర్

By Sumanth KanukulaFirst Published Dec 3, 2022, 3:03 PM IST
Highlights

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-5) ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యలో వర్కింగ్ ఉమెన్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-5) ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యలో వర్కింగ్ ఉమెన్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బలమైన మహిళా శ్రామికశక్తిని సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మంత్రి కేటీఆర్ శనివారం  ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన ఉమెన్ ఇన్ మెడికల్ కాన్‌క్లేవ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసిన మూడు కంపెనీలలో రెండు హైదరాబాద్‌కు చెందినవేనని అన్నారు.  

వైద్య రంగంలో మహిళలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్‌ కావాలని కోరుకుంటారని.. అలాగే తాను కూడా డాక్టర్‌ అవ్వాలని తన తల్లి అమ్మ కోరుకుందని చెప్పారు. 

“ఆరోగ్య సంరక్షణ రంగంలో పురోగతి సాధించిన మహిళల జాబితా అంతులేనిది. నేడు మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ డిజిటల్ టెక్నాలజీలను స్వీకరించడం వల్ల వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ పరిణామంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.  తెలంగాణలో 40 మిలియన్లకు పైగా పౌరుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక మిషన్‌ను ప్రారంభించిందని చెప్పారు. వైద్యం, సాంకేతికతను ఒకచోట చేర్చిందని.. రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ మిషన్‌‌ను చేపట్టినట్టుగా గుర్తుచేశారు. రాజన్న సిరిసిల్లలో ప్రత్యేక ఆంకాలజీ యూనిట్‌తో కూడిన మెడికల్ కాలేజీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.


మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి వీ-హబ్‌ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. జెండర్ ఈక్వాలిటీ పాలించే రాష్ట్రాల్లో తెంగాణ ఒకటన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రోగులకు అత్యంత నాణ్యమైన చికిత్స అందించినందుకు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
 

click me!