ప్రభుత్వ తప్పిదం వల్లే ఫారెస్ట్ రేంజర్ హత్య : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

By Siva KodatiFirst Published Dec 3, 2022, 3:00 PM IST
Highlights

ప్రభుత్వ తప్పిదం వల్లే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ హత్య జరిగిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రేంజర్ కుటుంబంలో ఒకరికి డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉద్యోగం ఇవ్వాలని విక్రమార్క డిమాండ్ చేశారు. 
 

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల జిల్లాలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలకు నిజాయితీ గల అధికారులు చనిపోతున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం దారుణమన్న ఆయన.. రేంజర్ హత్య ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని భట్టి అన్నారు. రేంజర్ కుటుంబంలో ఒకరికి డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉద్యోగం ఇవ్వాలని విక్రమార్క డిమాండ్ చేశారు. 

కాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూముల వివాదంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు బాధ్యులైన ఎర్రబోడు గుత్తికోయలను ఊరి నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామపంచాయతీ తీర్పు వెలువరించింది. గుత్తి కోయల వల్ల తమకు ప్రాణ హాని వుందని అందువల్ల వారిని స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు బెండాలపాడు గ్రామస్తులు పంచాయితీ ఈవోకు తీర్మానం కాపీని అందజేశారు. 

ALso REad:ఫారెస్ట్ ఆఫీసర్ బైక్ దగ్ధం... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఘటన, ఉలిక్కిపడ్డ అటవీ శాఖ

మరోవైపు.. విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాస రావు(45) అంత్యక్రియలు నవంబర్ 23న పూర్తయ్యాయి. పోడు సాగుకు అడ్డు వస్తున్నాడని గుత్తికోయిల చేతిలో శ్రీనివాసరావు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపుడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. 

ఇదిలావుండగా... చాలా  కాలంగా  తమకు  ఆయుధాలివ్వాలని పారెస్ట్  అధికారులు  డిమాండ్  చేస్తున్నారు. అడవిలో విధులు నిర్వహించాలంటే  ఆయుధాలు కావాలని కోరుతున్నారు. అయితే  ఈ  విషయమై  ప్రభుత్వం నిర్ణయం  తీసుకోలేదు. రాష్ట్రంలోని పలు  ఏజెన్సీ ప్రాంతాల్లో  ఆదీవాసీలకు , ఫారెస్ట్  సిబ్బంది మధ్య  వివాదాలు జరుగుతున్నాయి.  

click me!