
KTR: వారంటీ లేని పార్టీని ఇచ్చే గ్యారంటీలకు విలువుంటుందా? అని కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శలు గుప్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పార్టీలను బొంద పెట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం నిర్వహించిన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.." జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ.. .. కరెంటు ఇవ్వకుండా సతాయించిన పార్టీ.. సాగు నీరు ఇవ్వకుండా చావగొట్టిన పార్టీ .. మంచి నీళ్ల కోసం మూడ్చెర్ల నీళ్లు తాగించిన పార్టీ.. ఆరు దశాబ్దాలు ఆగం చేసి పార్టీ .. ఇవాల ఆరు గ్యారంటీలిస్తానంటుది. అలాంటి వారంటీ లేని పార్టీలిచ్చే గ్యారంటీలకు విలువుంటుందా? అని కేటీఆర్ విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవాచేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ కాదు.. 11 సార్లు అవకాశం ఇచ్చారని విమర్శించారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే ..గంటల విద్యుత్, ఏడాదికో ముఖ్యమంత్రి మారడం, రాష్ట్రంలో ఆడబిడ్డలు అవస్థలు పడటం గ్యారంటీ అన్నారు.
కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, కష్టాలు అని, బీఆర్‌ఎస్ అంటే సాగునీళ్లు,సంక్షేమ పథకాలని అన్నారు. రైతు బంధు కేసీఆర్ కావాలా? లేదా రాబంధు లాంటి కాంగ్రెస్ కావాలా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇచ్చే ప్రభుత్వం కావాలో.. ? 3గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో? ఒక్కసారి ఆలోచించుకోవాలని మంత్రి కోరారు.