ఆందోళన చెందొద్దు... బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా

Arun Kumar P   | Asianet News
Published : Jun 15, 2022, 12:13 PM ISTUpdated : Jun 15, 2022, 12:25 PM IST
ఆందోళన చెందొద్దు... బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా

సారాంశం

సమస్యల పరిష్కారానికై ఆందోళన చేపట్టిన బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు ఐటీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని  మంత్రి సూచించారు. 

నిర్మల్: అనేక సమస్యలతో సతమతమవుతూ ఆందోళనకు దిగిన బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆండ్ టెక్నాలజీస్ విద్యార్థులకు ఐటీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. విశ్వవిద్యాలయ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలంటూ కేటీఆర్ ను ఓ విద్యార్థి కోరాడు. యూనివర్సిటీలో మౌళిక సదుపాయాలను కల్పించాలంటూ 8000 మంది విద్యార్థులు చదువులు పక్కనపెట్టి రోడ్డెక్కారంటూ తేజ గౌడ్ అనే విద్యార్థి ట్విట్టర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో విద్యార్థులకు భరోసానిస్తూ కేటీఆర్ కీలక ప్రకటన చేసారు.

బాసర ఆర్జియూకేటి విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా చూస్తామని... అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.   

నిర్మల్ జిల్లాలోని బాసరలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో మౌళిక వసతులు కరువయ్యాయని, కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.   యూనివర్సిటీలో చదివే దాదాపు ఎనిమిదివేల మంది విద్యార్థులు నిన్న(మంగళవారం) పరిపాలనా భవనం ఎదుట ఉదయం నుండి సాయంత్రం వరకు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎన్నిసార్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని... అందువల్లే ఆందోళన బాట పట్టినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. 

యూనివర్సిటీ హాస్టల్లో నాణ్యమైన భోజన పెట్టకపోవడం, మూడేళ్లుగా ల్యాప్ టాప్ లను ఇవ్వకపోవడం, ఏకరూప దుస్తుల పంపిణీ,  చేయడంలేదంటూ, ఖాళీగా వున్న ఫోస్టులను భర్తీ చేయడంలేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. చివరకు తమ సమస్యల గురించి చెప్పుకుందామంటూ విశ్వవిద్యాలయానికి శాశ్వత వైస్ ఛాన్సలర్ లేరని విద్యార్థులు వాపోయారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినా లాభంలేకుండా పోయిందని... అందువల్లే ఆందోళన బాట పట్టినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. సమస్యల పరష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళనను విరమించబోమని విద్యార్థులు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రెండోరోజయిన ఇవాళ ఉదయం నుండి వేలాదిమంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా కొనసాగిస్తున్నారు. విధ్యార్థుల ఆందోళనకు ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీ లు మద్దతు పలికాయి. 

ఇక బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన యూనివర్సిటీ అధికారులపై చర్యలు సిద్దమని ఆమె తెలిపారు. అలాగే విద్యార్థుల సమస్యలతో రాజకీయం చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.


 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?