
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ డబ్బులిచ్చినా తీసుకోవాలని , ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడతూ.. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మొద్దన్నారు. కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు బాగా డబ్బులు సంపాదించి, వాటితో ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీఎం ఎవరు అవుతారో తెలియని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిందని కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కటిక చీకట్లు, తాగునీటి ఇక్కట్లు, ఎరువులు, విత్తనాల కోసం కష్టాలు గ్యారెంటీ అని మంత్రి ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు సీఎం మారుతారని, రాజకీయ అస్థిరత గ్యారెంటీ అంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీం అన్నారు. దశాబ్ధాలుగా అధికారంలో వున్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో అతి త్వరలో సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ALso Read: తెలంగాణపై విషం కక్కుతున్న మోడీ.. విభజన తర్వాత సంబురాలు చేసుకోలేదా?: మంత్రి హరీశ్ రావు ఫైర్
ఇదే సమయంలో బీజేపీపైనా కేటీఆర్ మండిపడ్డారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహిస్తే కేంద్రంలోని వారికి నచ్చలేదన్నారు. మోడీ భ్రమల నుంచి ప్రజలు బయటపడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. రజాకార్ సినిమాతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. రజాకార్, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ అంటూ భావోద్వేగాలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.