నాగోల్ ఫ్లై ఓవర్‌ ప్రారంభం.. మౌలిక సదుపాయాలు పెంచుకోకపోతే బెంగళూరు లాంటి పరిస్థితి వస్తుందన్న కేటీఆర్..

Published : Oct 26, 2022, 02:21 PM IST
నాగోల్ ఫ్లై ఓవర్‌ ప్రారంభం.. మౌలిక సదుపాయాలు పెంచుకోకపోతే బెంగళూరు లాంటి పరిస్థితి వస్తుందన్న కేటీఆర్..

సారాంశం

హైదరాబాద్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద చేపట్టిన కీలకమైన నాగోల్ ఫ్లై ఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యగ్గె మల్లేష్, దయానంద్, జనార్దన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ శరవేగంగా  విస్తరిస్తోందన్నారు. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఎలా  విస్తరిస్తుందో రోజూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నామని అన్నారు. 

నగర విస్తరణకు తగ్గట్టుగా..  మౌలిక సదుపాయాలు పెంచుకోకపోతే బెంగళూరు లాంటి పరిస్థితి వస్తుందని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ కింద 47 ప్రాజెక్టులు చేపడితే.. అందులో ఎల్బీ నగర్- ఉప్పల్ పరిధిలో 17 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు. ఆరేడేళ్ల కిందట ఎల్బీ నగర్ చౌరస్తా గందరగోళంగా ఉండేందన్నారు. ఎల్‌బీ నగర్‌లో కోట్లాది రూపాలయతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రూ. 143 కోట్లతో నాగోల్ ఫ్లై ఓవర్‌ను నిర్మించామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. ఎల్‌బీ నగర్‌లో రోడ్ల అభివృద్ది కోసం రూ. 700 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.  

హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా  అభివృద్ది చెందుతున్న నగరం అని చెప్పారు. వరల్డ్ గ్రీన్‌సిటీగా హైదరాబాద్‌కు అవార్డు రావడం గర్వకారణమని చెప్పారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్నామని తెలిపారు. ఎల్‌బీ నగర్‌లో రిజిస్ట్రేషన్ల సమస్యను నాలుగైదు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. రాజకీయాలు ఎన్నికలప్పుడూ చూద్దామని అన్నారు. ప్రజల అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ప్రజా ప్రతినిధులందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ది సాధ్యం అని అన్నారు. 

 

ఇక, నాగోల్‌ ఫ్లైఓవర్‌.. 990 మీటర్ల పొడవున ఆరు లేన్లుగా నిర్మించారు. ఈ టూ వే ఫ్లైఓవర్‌తో ఉప్పల్‌ - ఎల్బీనగర్‌ మార్గంలో వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఏర్పడనుంది. సిగ్నల్ ఫ్రీ ప్రయాణంతో ట్రాఫిక్‌ సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.143.58 కోట్లు  ఖర్చు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి