కేటీఆర్ ఔదార్యం... గాయాలతో రోడ్డుపై పడివున్న యువకులను కాపాడి...(వీడియో)

By Arun Kumar PFirst Published Jul 27, 2021, 9:41 AM IST
Highlights

మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. ఆపదలో వున్నవారికి సాయం చేయడం కంటే పెద్దపని ఏదీ లేదని భావించి బిజీ షెడ్యూల్ లోనూ ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడేందుకు తాపత్రయపడ్డారు. 

సిద్దిపేట: తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనపెట్టి ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. దగ్గరుండి మరీ రోడ్డుపై గాయాలతో పడివున్న యువకులను హాస్పిటల్ కు తరలించారు. అంతేకాదు వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లుకు సైతం ఫోన్ చేశారు. ఇలా ప్రమాదానికి గురయిన యువకుల ప్రాణాలు కాపాడేందుకు తాపత్రయపడి ఔధార్యం చాటుకున్నారు కేటీఆర్. 

వివరాల్లోకి వెళితే... సోమవారం మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. నియోజకవర్గంలో కార్యక్రమాలు ముగించుకున్న ఆయన రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే ఇదే సమయంలో సిద్దిపేట బైపాస్ పై మెడికల్ కాలేజీ దగ్గరలో బైక్ ఆక్సిడెంట్ జరిగింది. ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ ప్రమాదవశాత్తూ డివైడర్ ని ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 

వీడియో

యువకులు గాయాలతో రోడ్డుపై పడివున్న సమయంలో అటువైపు కేటీఆర్ కాన్వాయ్ వెళ్లింది. గాయపడిన యువకులను చూసి చలించిపోయిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ ని నిలిపి యువకులకు సాయం చేశారు. తన కాన్వాయ్ లోని రెండు కార్లలో ఇద్దరు క్షతగాత్రులను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  పీఎ మహేందర్ రెడ్డి, ఎస్కార్ట్ పోలీసులను ఇచ్చి పంపించడమే కాదు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ లో  సూచించారు.  

ఇలా ఆపదలో వున్నవారిని కాపాడి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు కేటీఆర్. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో వున్న తమవారిని కాపాడిన మంత్రి కేటీఆర్ కు క్షతగాత్రుల కుటుంబసభ్యులు, బంధువులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

click me!