బీఆర్ఎస్ పార్టీపైనా, తనపైనా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్ . కేసీఆర్ కు పిండం పెట్టాలనప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడికి పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఆదివారం హైదరాబాద్ జలవిహార్‌లో బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌లు, వార్ రూమ్ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన ఖర్మ మాకు లేదన్నారు. రూ.50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.
రేవంత్ డబ్బులు వసూలు చేస్తున్నాడని వాళ్ల పార్టీ నేతలే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారని ఆయన చురకలంటించారు. జానారెడ్డి ముందుగా వాళ్ల పీసీసీ చీఫ్‌కు సంస్కారం నేర్పాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు పిండం పెట్టాలనప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడికి పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్రభావం తెలియని నేతలు ఇంకా వున్నారని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియా వల్లే మోడీ జాతీయ స్థాయి నేతగా ఎదిగారని.. సీనియర్ పోలిటిషన్స్ ఇంకా కొత్త రకం ఎన్నికల విధానానికి అలవాటు పడలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ALso Read: కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం బయటపడింది.. కేసీఆర్ ఇప్పుడెందుకు స్పందించడం లేదు: రేవంత్
అంతకుముందు రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. కేటీఆర్‌కు సంస్కారం లేదని.. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు ఏ పదవి లేకుండా స్వాతంత్య్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ కాదా అని జానారెడ్డి ప్రశ్నించారు. ఉపాధి హామీ, ఆహార భద్రత, అటవీ హక్కులు, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కదా అని ఆయన నిలదీశారు.
కరెంట్ ఉత్పత్తికి కృషి చేసింది తామేనని.. వాటిని మీరు కొనసాగిస్తున్నారని జానారెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌ని సహించే పరిస్ధితిలో జనం లేరని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ. 5.50 లక్షల కోట్లు అప్పు చేశారని జానారెడ్డి ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా వుందని.. 2004లోనే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.