
జాతీయ రాజకీయాలు, సీఎం కేసీఆర్‌తో (kcr) ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (prashant kishor) భేటీ, థర్డ్ ఫ్రంట్, రాష్ట్రంలో బీజేపీ దూకుడు , షర్మిల పాదయాత్ర వంటి అంశాలపై టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ‘‘ఎన్టీవీ’’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల (ys sharmila) అత్తమీద కోపం దుత్త మీద చూపిస్తోందని ... తెలంగాణకు షర్మిల కాంట్రిబ్యూషన్ ఏముందని కేటీఆర్ నిలదీశారు.
మరణించే వరకు తెలంగాణకు వైఎస్ బద్ధ వ్యతిరేకి (ys rajasekhara reddy) అని మంత్రి గుర్తుచేశారు. షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్‌లు కేసీఆర్‌ను బూతులు తిడతారని... కేంద్రాన్ని మాత్రం ఒక్క మాట అనరని కేటీఆర్ మండిపడ్డారు. షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరి ఏజెంట్లు అని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ ఓటును చీల్చడానికి బీజేపీ వీళ్లని తెచ్చిందా అని ఆయన నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదని.. తము బలమైన ఓటు వుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్న మీద కోపం వుంటే షర్మిల ఆంధ్రాలో పార్టీ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మీద ఎంతో కొంత అసంతృప్తి వుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. మోడీతో వున్న వ్యతిరేకతతో పోల్చితే ఇది ఎంత అని మంత్రి అన్నారు. ఈ శిఖండి సంస్థల్ని ఎవరు పుట్టించారన్న ఆయన.. తెలంగాణలో కుల, మత రాజకీయాలు నడవవని కేటీఆర్ స్పష్టం చేశారు. కుటుంబ పాలనపై కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా వుందన్నారు. అమిత్ షా (amit shah) కొడుకు బీసీసీఐ (bcci) జనరల్ సెక్రటరీ ఎలా అయ్యాడని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకుంటేనే కల్వకుంట్ల కుటుంబం వుందని.. ప్రజలు వద్దనుకుంటే ఇంటికి వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. అంత కుతూహలం వుంటే ఈడీ దాడులు చేయాలని .. తవ్వండి, తీయండి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
వ్యక్తులు పార్టీలో చేరడం , వెళ్లిపోవడం సహజమని , ఈటల రాజేందర్ (etela rajender) మంత్రిగా అసైన్డ్ భూముల్ని కబ్జా చేశారని కేటీఆర్ ఆరోపించారు. తప్పు చేశారు కాబట్టే ఈటల వెళ్లిపోయారని మంత్రి తెలిపారు. గవర్నర్ 15 రోజులు ఫైల్ పెట్టుకుంటే ప్రభుత్వం పడిపోతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదొస్తామంటే ఎలా అని మంత్రి నిలదీశారు. పార్టీ అధ్యక్షుల్ని గవర్నర్‌గా చేస్తే ఇలాగే వుంటుందంటూ సెటైర్లు వేశారు. తమిళిసై (tamilisai soundararajan) మహిళేనని.. మరి మమతా బెనర్జీ (mamata banerjee) కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇవ్వకుండానే.. ఇచ్చినట్లు ప్రసంగంలో మాట్లాడారని మంత్రి దుయ్యబట్టారు. మీరు గవర్నరా.. బీజేపీ కార్యకర్తనా అని కేటీఆర్ నిలదీశారు.
మాట ఇచ్చిన 8 ఏళ్ల తర్వాత 111 ఎత్తేశామని మంత్రి గుర్తుచేశారు. రైతులు సంబరాలు చేసుకుంటున్నారని.. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. ధరణిలో లెక్కలు బయటికి తీయాలని... 111 జీవోలో ఎవరి భూములు ఉన్నాయో తీయాలని, అప్పుడు ఏ పార్టీ నాయకులకు ఉన్నాయో తెలుస్తుందని మంత్రి డిమాండ్ చేశారు. దమ్ముంటే ఉచిత వైద్యం, విద్య కోసం పార్లమెంట్‌లో చట్టం తేవాలన్నారు. తాము 3 లక్షల 66 వేల కోట్లు కేంద్రానికి ఇస్తే.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది లక్షా 68 వేల కోట్లని కేటీఆర్ తెలిపారు. దేశానికి తెలంగాణ ఆదాయం ఇస్తున్నందుకు గౌరవంగా వుందన్నారు.
తాము తెలంగాణను నడుపుతున్నామంటే ఒళ్లు మండుతోందని మంత్రి పేర్కొన్నారు. బండి సంజయ్ పాదయాత్ర.. అసమర్ధుడి జీవనయాత్ర అంటూ ఆయన సెటైర్లు వేశారు. కేంద్రం ఎంత ఇచ్చిందో అందరికీ తెలుసునని.. కిషన్ రెడ్డికి దమ్ముంటే ఎన్టీవీ స్టూడియోకి వచ్చి చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. వరి వేయకుండా నష్టపోయిన రైతులకు కేంద్రం పరిహారం ఇవ్వాలని.. అతి తక్కువ ఆత్మహత్యలు తెలంగాణలోనే చోటు చేసుకున్నాయని మంత్రి అన్నారు. అధికారంలో వున్నా తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడమని.. అవసరమైతే భగవంతుడినైనా తలపడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోడీ జేజమ్మతోనైనా పోరాడతామని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసేవాళ్లు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.