
కేసీఆర్ (kcr) తెలంగాణలో తీసుకొచ్చిన ‘‘ రైతు బంధు’’ను (rythu bandhu) దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. తద్వారా దేశ రైతాంగానికి మేలు జరగడం వెనుక టీఆర్ఎస్ (trs) వుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ (ktr) అన్నారు. రేపు హెచ్ఐసీసీ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ (trs plenary 2022) ఏర్పాట్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.... మిషన్ భగీరథ ద్వారా ‘‘ హర్ ఘర్ కో జల్’’ అనే పథకానికి కేసీఆర్ స్పూర్తిగా నిలిచారని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రేపు వివిధ జాతీయ పరమైన అంశాలు , భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం తదితర అంశాలపై కేసీఆర్ ప్రసంగిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోని మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను వినిపించేలా కేసీఆర్ ప్రసంగిస్తారని చెప్పారు.
జెండా పండుగకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇవాళ సాయంత్రంలోగా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం పార్టీ ప్రతినిధుల కార్యక్రమం అనే విషయాన్ని మనం నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం పార్టీ పంపించిన పాస్ ఉన్న వారికి మాత్రమే ఆహ్వానం ఉన్నదన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఇప్పటి నుంచే పార్టీ నిర్దేశించిన ప్రతినిధులకు పాసులు అందినవో, లేవో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైన ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పార్టీని సంప్రదించాలన్నారు.
రేపు 9 గంటలకు హైటెక్స్ సభా ప్రాంగణానికి చేరుకునేందుకు అవసరమైన రవాణా, వాహన సదుపాయాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను ఒకసారి పర్యవేక్షించాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిసి గ్రామంలోని పార్టీ శ్రేణులతో అందరినీ కలుపుకొని ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలనీ, దీంతోపాటు పట్టణాల్లోని బస్తీలు వార్డ్ కమిటీల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ సూచించారు.