రైతుబంధు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అవుతోందని, పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఏం చేసిందని హరీశ్ రావు ప్రశ్నించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని అన్నారు. ఆదివారం ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రహదారులపై శ్రద్ధ పెట్టలేదని అన్నారు.
తమ ప్రభుత్వం ఎవరినపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోదని మంత్రి అన్నారు. అయితే తప్పులు ఉంటేనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రీజినల్ రింగ్ రోడ్డును సౌత్ నేషనల్ హైవేగా గుర్తించాలని కోరుతానని తెలిపారు. అలాగే పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చలు జరుపుతానని చెప్పారు.
హరీశ్ రావు ప్రశ్నలపై మంత్రి సీతక్క కూడా స్పందించారు. గత ప్రభుత్వం ఇష్టారీతన నిర్ణయాలు తీసుకుందని, ఇష్టమున్నట్టుగా నిబంధనలు రాసుకుందని విమర్శించారు. అందుకే అప్పుడు రైతు బంధు నిధులు మంత్రులకు లక్షల్లో వెళ్లడాన్ని చూశామని అన్నారు. అందుకే రైతు బంధుకు సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారని, ఆ తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు.
కాగా.. హరీశ్ రావు శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వెంటనే ఎకరానికి 15 వేలు చొప్పున విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము.. రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ప్రతి క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు ఎప్పటినుంచి ప్రారంభిస్తారో చెప్పాలని నేను తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత కోరుతున్నాను. ’’ అని అన్నారు.