
మునుగోడు బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి. అమిత్ షా ప్రసంగంలో అబద్ధాలు, ఆధారరహిత ఆరోపణలు మినహా మరోటి లేదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణా వాటా ఎందుకు తేల్చ లేకపోయావు మోడీ అని నిన్నటి అదే మునుగోడు సభలో కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పలేదని జగదీశ్ రెడ్డి నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నకు ప్రధాని మోడీ దగ్గరే సమాధానం లేదని ఇక అమిత్ షా దగ్గర సమాధానం ఉంటుందని ఆయన చురకలు వేశారు.
బండి సంజయ్ నోట్లో నోరు పెట్టి మాట్లాడినట్లు ఉంది తప్ప కొత్తదనం ఏమాత్రం కనిపించలేదని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో పూర్తిగా దిగజారుడుతనం కనిపిస్తోందని మంత్రి అన్నారు. ఆయన చేసిన ప్రసంగం హోంమంత్రి స్థాయికి తగినట్లు లేదని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ఫక్తు రాజకీయాలు, ఓట్లు, సీట్లు అధికారం తప్ప మరొకటి ఆయన మాటల్లో వినిపించలేదన్నారు. మునుగోడు ప్రజల ఆశలు నిరాశలయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
ALso REad:కేసీఆర్ ప్రశ్నలను పట్టించుకోని అమిత్ షా.. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే టీఆర్ఎస్‌కు పొగేనంటూ వ్యాఖ్యలు
దేశాన్ని ఏలుతున్న పార్టీలో రెండో స్థానంలో ఉన్న పెద్ద మనిషి వచ్చినప్పుడు తమ గోడు పెద్దదని వచ్చిన పెద్ద మనిషి వరాల జల్లు కురిపిస్తారనుకుంటే అది వమ్ము అయిందన్న బాధ ప్రజల్లో కనిపించిందన్నారు. అంతిమంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిందే నిజం అవుతుందని... మోటర్లకు మీటర్లు పెట్టాలన్నదే మోడీ ఎజెండా అని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. అయితే మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డలు చైతన్యవంతులని బీజేపీకి ఇక్కడి ప్రజలు మోటార్లు బిగిస్తారని హెచ్చరించారు. రేపటి ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కదని జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు.
అంతకుముందు మునుగోడులో జరిగిన బహిరంగసభలో అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్‌ని పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. పొగ మాదిరిగా కేసీఆర్ సర్కార్ మాయమైపోతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం చేస్తానని కేసీఆర్ చెప్పారని.. ఈ విషయంలో కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. మన ప్రభుత్వం వచ్చాక విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 3 వేలు ఇస్తామని వాగ్థానం చేశారని.. అమలు జరుగుతోందా అని అమిత్ షా ప్రశ్నించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం హామీ ఏమైందని ఆయన నిలదీశారు. పేద, బడుగు వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. దళిత సీఎం హామీ ఏమైందని కేసీఆర్‌ను నిలదీశారు. మరోసారి టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సీఎం వుంటారని అమిత్ షా జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల వేళ దళితబంధు హామీ ఇచ్చారని.. కానీ అమలు జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు.