మైనార్టీలకు రూ.లక్ష ఆర్ధిక సాయం.. ఈ నెల 16 నుంచి చెక్కుల పంపిణీ : హరీశ్‌‌రావు

By Siva KodatiFirst Published Aug 8, 2023, 8:34 PM IST
Highlights

ఈ నెల 16 నుంచి 10 వేల మందికి మైనారిటీ సాయం కింద రూ.లక్ష చెక్కులను పంపిణీ చేస్తామన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. దామాషా ప్రకారం రూ.లక్ష ఆర్ధిక సహాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

మైనార్టీల సంక్షేమంలో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి రూ.లక్ష ఆర్ధిక సాయానికి సంబంధించి తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. మైనార్టీలకు లక్ష ఆర్ధిక సాయం, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, ఇమామ్, మౌజంల సంఖ్య పెంపు తదితర అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మైనార్టీ ఆర్ధిక సాయానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తొలి విడతలో 10 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 16 నుంచి రూ. లక్ష చెక్కులను పంపిణీ చేయాలని హరీశ్ రావు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో సమానంగా మైనారిటీ సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి చెప్పారు. శ్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు.. ఇమామ్, మౌజంల సంఖ్య పెంపు వంటి హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే కేటాయించిన రూ.270 కోట్లకు అదనంగా మరో రూ.130 కోట్లను కలిపి విడుదల చేయాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. 

ALso Read: మందు పోయించ‌ను.. పైస‌లు పంచ‌ను.. ఓడిపోతే.. : మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

దామాషా ప్రకారం రూ.లక్ష ఆర్ధిక సహాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అలాగే షాదీ ముబారక్‌కు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు వేగంగా సొమ్ము అందేలా చూడాలని హరీశ్ రావు సూచించారు. శ్మశాన వాటికలు, ఈద్గాల భూముల కోసం వచ్చిన వినతలును క్రోడీకరించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, మైనారిటీ సెక్రెటరీ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

click me!