ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో పార్టీలు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన నేతలు ప్రత్యార్థులపై మాటల తూటలు పేల్చుతున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావు బీజేపీ ఎమ్మెల్యే ఈ టెల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. ఓటరు దేవుళ్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. తమకు ఓటేసేలా భారీ హామీలిస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీల బడా నేతలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి.. ఉకదంపుడు ఉపన్యాసాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఇలా ప్రచారం రోజురోజుకు జోరుగా సాగుతోంది.
తాజాగా మంత్రి హరీశ్ రావు బీజేపీ ఎమ్మెల్యే ఈ టెల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికలనగానే చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడతారనీ, మనల్ని మభ్య పెడతారని అన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత (నవంబర్ 30 తరువాత) గజ్వేల్ లో ఎవరు ఉండరని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్ పోటీ చేయకుంటే కట్టించిన బిల్డింగ్ లకు కూడా సున్నాలు కూడా వేయలేరని మంత్రి విమర్శించారు. ఒకప్పుడు గజ్వేల్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో ? ప్రజలే ఆలోచించాలని అన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని, సిద్దిపేట కంటే మంచి మెజార్టీని సీఎం కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాలని అన్నారు. ఈ సారి మాత్రం గజ్వేల్ లో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్ గల్లంతు అవ్వడం ఖాయమని అన్నారు.
అయితే.. అంతకు ముందుకు గజ్వేల్ లో పర్యటించిన ఈటెల రాజేందర్ గులాబీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తన మీటింగులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి నీచమైన పనే హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆచరించిందని, ప్రజలకు అడ్డగోలుగా డబ్బులు పంపిణీ చేసి ప్రలోభపెట్టారని, కానీ ఫలితం ఎలా వచ్చిందో అందరిని తెలిసిందేనని అన్నారు. అలాగే.. గజ్వేల్లో కూడా అదే సీన్ రీపిట్ అవుతుందని, హుజురాబాద్‌లో ఎలాగైతే విజయం సాధించామో ఇక్కడా కూడా అలాగే గెలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన కడుపుకొట్టి, నోరు కొట్టి .. కేసీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించారనీ, ఆ డబ్బుతో మన ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు.