
సిద్దిపేట : తెలంగాణకు అల్లావుద్దీన్ దీపం కాదు కేసిఆర్ అనే దీపం ఉన్నాడు... అందువల్లే రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఏ రంగంలో అయినా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం చాలా అభివృద్ధి జరిగిందని... భూమి, ఆకాశం అంత వ్యత్యాసం వుంటుందని అన్నారు.పుట్టిపెరిగిన సిద్దిపేట పేరును కెసిఆర్ ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళాడని హరీష్ అన్నరు.
ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూర్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నంగునూరు చేరుకున్న హరీష్ స్థానిక నల్లపోచమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ రోజా శర్మ తదితరులతో కలిసి బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... గతంలో తెలంగాణ ఉధ్యమ సమయంలో గులాబీ జెండాను నంగునూర్ నుండే కేసీఆర్ ప్రారంభించాడని గుర్తుచేసారు. అందువల్లే ఆత్మీయ సమ్మేళనాలను కూడా ఇక్కడినుండే ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇక్కడి ప్రజల దీవెనలతోనే కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నారని హరీష్ తెలిపారు.
Read More కేంద్రానికి కేటీఆర్ ఘాటు లేఖ.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రంపై సీరియస్
గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ ఉంటే వార్త, నేడు బిఆర్ఎస్ పాలనలో పోతే వార్త అని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల పాలనలో లంచాలు ఇస్తేనే ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చేవాళ్ళు... నేడు బిస్కెటలా ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు ఉచితంగానే 24గంటల కరెంట్ ఇస్తుంటూ కేంద్ర అడ్డుకోవాలని చూస్తోందని... కానీ కెసిఆర్ బావుల వద్ద మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారని హరీష్ అన్నారు.
బీజేపీ అంబానీ అదాని ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తే, కెసిఆర్ రైతుల ఆదాయం పెంచుతున్నాడని హరీష్ అన్నారు. కలలోనైనా కనని పనిని కేసిఆర్ చేసి పెట్టారని... నీళ్ల గోస లేకుండా ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇస్తున్నారని అన్నారు. నంగునూరుకు కాళేశ్వరం ద్వారా 18వేల ఎకరాల్లో వరిసాగు అవుతోందని... నాట్లు వేయడానికి ఛత్తీస్ ఘడ్ నుండి కూలీలు వస్తున్నారని హరీష్ అన్నారు. తెలంగాణ రైతులు కార్లలో తిరిగే రోజులు రావాలన్నది తన కోరికని... అది దగ్గరలోనే ఉందని హరీష్ అన్నారు.
Read More కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త.. వీసీ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు విద్యార్థుల యత్నం..
ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపి నేతలు వస్తారు... కానీ ఆపదలో, సంపదలో తోడుండేది ఎవరో గమనించాలని బిఆర్ఎస్ శ్రేణులకు హరీష్ సూచించారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు ఇస్తే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని... అధికారంలో వున్నది తామే కాబట్టి తప్పకుండా బిఆర్ఎస్ నాయకులకు ఇస్తామన్నారు. కార్యకర్తలు చిన్నచిన్న పొరపొచ్చాలు ఉంటే మాట్లాడుకుందాం... కన్నతల్లి లాంటి పార్టీని కాపాడుకునే బాధ్యత మనందరిదని అన్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా బలపరచడానికి కార్యకర్తలు సిద్దంగా ఉండాలని హరీష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీ సమాధులు తవ్వే ప్రయత్నం చేస్తే కెసిఆర్ బలమైన పునాదులు తవ్వే ప్రయత్నం చేస్తున్నాడని హరీష్ పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. కెసిఆర్ సంపద పెంచి పేదలకు పంచితే బీజేపీ వాళ్లు పేదల వద్ద పన్నులు గుంజి అదానికి పెడుతున్నారని హరీష్ ఎద్దేవా చేసారు.