
విపక్షాలపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో 1500 మంది ఆశావర్కర్లకు ఆయన అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గతంలో వేతనం పెంచాలని కోరిన ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించారని గుర్తుచేశారు. దేశంలో ఆశావర్కర్లకు అత్యధిక వేతనం ఇచ్చేది తెలంగాణ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. మోడీ సొంత రాష్ట్రంలోనూ ఆశా వర్కర్లకు వేతనాలు తక్కువేనని హరీశ్ దుయ్యబట్టారు.
అలాగే ఆశా వర్కర్ల ఫోన్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని.. ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని మంత్రి తెలిపారు. నగరంలో 350 బస్తీ దవాఖాలను కేసీఆర్ ఏర్పాటు చేశారని.. దీని వల్ల ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వెళ్లే వారు తగ్గిపోయారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. టీ డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 వైద్య పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు నరం లేని నాలుక అన్నట్లుగా వ్యవహరిస్తోందని.. తమ ప్రభుత్వం న్యూట్రిషన్ రాజకీయాలు చేస్తే, విపక్షాలు పార్టిషన్ రాజకీయాలు చేస్తున్నాయని హరీశ్ రావు సెటైర్లు వేశారు.
Also Read: చంద్రబాబు నాయుడుపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన నిజాయితిని శంకించాల్సిందే?
మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి భాగస్వాములతో నిర్వహించబోయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం వచ్చిందని, దానికి టీడీపీ హాజరు కావాలనే నిర్ణయాలు తీసుకున్నారని వచ్చిన వార్తలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ నిర్వహించబోయే సమావేశానికి ఎన్డీఏ పార్ట్‌నర్‌లు హాజరవుతాయని, ఈ భేటీకి టీడీపీకి కూడా ఆహ్వానం అందినట్టు వార్తలు వచ్చాయి. ఒక వేళ ఆహ్వానం అందినా దానిపై టీడీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నది స్పష్టంగా తెలియరాలేదు. ఎన్డీఏ భేటీకి ఆహ్వానం అందిందని, ఆ భేటీకి హాజరు కావాలనే టీడీపీ నిర్ణయించుకున్నట్టు నిన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ భేటీకి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్టూ వార్తలు వచ్చాయి.
టీడీపీ ఎన్డీఏ కూటమికి వెళ్లుతారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు అనేక అంశాలపై, సమస్యలపై కేంద్రంపై విమర్శలు చేసిన చంద్రబాబు అసలు రూపం ఇదా? అంటూ అడిగారు. కేంద్రానికి వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన టీడీపీ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నదా? అని ప్రశ్నించారు. అలాగైతే.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తామనే చంద్రబాబు నాయుడు నిజాయితీని శంకించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.