కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపులు అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ధరణి వద్దు అనడం అంటే పటేల్, పట్వారీ వ్యవస్థను తెలంగాణలో మరోసారి తెచ్చినట్లేనని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేత , మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోసారి కేసీఆర్ ఎందుకు గెలవాలో వివరిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. తాజాగా సంగారెడ్డిలో హరీశ్‌రావు ప్రసంగిస్తూ.. ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారికి మధ్య ఈసారి పోటీ జరుగుందని హరీశ్‌రావు అభివర్ణించారు.
కేసీఆర్ పాలనలో వుంటేనే తెలంగాణ సుభిక్షంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపులు అని హరీశ్ ఎద్దేవా చేశారు. ధరణి వద్దు అనడం అంటే పటేల్, పట్వారీ వ్యవస్థను తెలంగాణలో మరోసారి తెచ్చినట్లేనని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ తన తండ్రి దేశానికి కంప్యూటర్ తెచ్చారని చెబుతున్నారని .. తాము కూడా ధరణిని కంప్యూటరీకరణ చేస్తే మాత్రం వద్దు అంటున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. ధరణిని వ్యతిరేకిస్తే ప్రజలే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారని ఆయన హెచ్చరించారు.
ఇకపోతే.. ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే పలు సభల్లో పాల్గొని ఓ రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. దసరా విరామం తర్వాత తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్దమవుతున్నారు. గురువారం (అక్టోబర్ 26) నుంచి కేసీఆర్ మరోసారి సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. తొలి విడత మాదిరిగానే.. ఒక రోజులో 2 లేదంటే 3 సభలకు కేసీఆర్ హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. ఈ విడతలో 30కి పైగా సభల్లో కేసీఆర్ పాల్గొనున్నారు.
Also Read: తెలంగాణ ఎన్నికలు: టార్గెట్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రచార అస్త్రం..
ఈ నెల 26న సీఎం కేసీఆర్ ముందుగా అచ్చంపేట, నాగర్‌కర్నూల్ బహిరంగసభల్లో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడుకు చేరుకోనున్నారు. అనంతరం శుక్రవారం (అక్టోబర్ 27) రోజున పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్టోబర్ 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో ఎన్నికల సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందులలో ప్రచారంలో పాల్గొంటారు. నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురిలో బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నవంబర్ 3వ తేదీన ముథోల్, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మంలలో, నవంబర్ 6న గద్వాల్, మక్తల్, నారాయణపేట్, నవంబర్ 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, నవంబర్ 8న సిర్పూర్, అసిఫాబాద్, బెల్లంపల్లిలలో కేసీఆర్.. బీఆర్ఎస్ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.