టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని సెటైర్లు వేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని సెటైర్లు వేశారు. వ్యవసాయంపై అవగాహన లేకపోవడంతో రైతుబంధు, ధరణి, కరెంట్ గురించి రేవంత్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తుందని మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. కర్ణాకటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుందని అన్నారు. ఐదు గంటలు కరెంట్ ఇస్తూ దాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గొప్పగా చెబుతున్నాడని మండిపడ్డారు.
ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లే దర్శనమిచ్చేవని అన్నారు. కేసీఆర్ పాలనలో పరిస్థితి మారిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో కరువు కాటకాలు లేవని చెప్పారు. పల్లెల్లో సాగునీటికి, హైదరాబాద్‌లో తాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, భరోసా అని అన్నారు.