‘కోడ్‌’ కష్టాలు : డబ్బే కాదు..దుస్తులు, బంగారం, బహుమతులు అన్నీ సీజే .. పెళ్లి చేసేదేట్లా

By Siva Kodati  |  First Published Nov 12, 2023, 2:53 PM IST

ఎన్నికల కోడ్ కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వివాహాది శుభకార్యాలు, ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారు, భూముల క్రయ విక్రయాలు నిర్వహించేవారు, వ్యాపారస్తులను ఎన్నికల కోడ్ ఇక్కట్ల పాలు చేస్తోంది. 


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తికాగా.. ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్ధులు దూసుకెళ్తున్నారు. వీరికి తోడు అగ్రనేతలు రంగంలోకి దిగడంతో తెలంగాణలో వాతావరణ హాట్ హాట్‌గా మారింది. ఇక షరా మామూలుగానే భారీగా నగదు, నగలు, మద్యం పట్టుబడుతోంది. పోలీసులు , ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టడంతో అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. 

అంతా బాగానే వుంది కానీ.. ఎన్నికల కోడ్ కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వివాహాది శుభకార్యాలు, ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారు, భూముల క్రయ విక్రయాలు నిర్వహించేవారు, వ్యాపారస్తులను ఎన్నికల కోడ్ ఇక్కట్ల పాలు చేస్తోంది. ముఖ్యంగా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెళ్లి ఖర్చులు లక్షల్లో వుండటంతో జనం నగదును ఎక్కువగా వెంట తీసుకెళ్తారు. షాపింగ్ కోసం జిల్లాల సరిహద్దులు దాటి హైదరాబాద్‌, విజయవాడ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లాల్సి వుంటుంది. 

Latest Videos

ఎన్నికల కోడ్ కారణంగా ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో వారిని తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. సరైన ఆధారాలు చూపకుంటే నగదును సీజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆవేదన వర్ణనాతీతం. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే.. కేవలం డబ్బు మాత్రమే కాదు.. బంధువులకు పంచే బహుమతులు, చీరలు, ఇతర వస్తువులను కూడా అధికారులు సీజ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. పోనీ వివాహాన్ని వాయిదా వేద్దామా అంటే మంచి రోజులని, బోల్డెంత ఖర్చు చేశామని, ఇతరత్రా కారణాలతో వెనకడుగు వేస్తున్నారు. 

click me!