"కడుపులోని విషాన్ని కక్కడానికే తెలంగాణ పర్యటన" : ప్రధానిపై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

Published : Apr 08, 2023, 07:02 PM ISTUpdated : Apr 08, 2023, 07:04 PM IST
"కడుపులోని విషాన్ని కక్కడానికే తెలంగాణ పర్యటన" : ప్రధానిపై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదనీ, తన కడుపులోని విషాన్ని కక్కడానికే రాష్ట్రంలో పర్యటిస్తున్నారని హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ప్రధాని ప్రసంగంలో ప్రతీ మాట సత్యదూరమని, ప్రధానిగా ఇన్ని అబద్ధాలు  ఆడడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ  ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటివి లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ అవుతున్నాయని, తనవల్లే డిబిటి మొదలైనట్లు చెప్పడం పచ్చి అబద్దమని, ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.

రైతుబంధును కాపీ కొట్టే.. పీఎం కిసాన్ ప్రారంభించారనీ, పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. అసలు రైతుబంధుతో పోలిస్తే పీఎం కిసాన్ సాయమెంత? అని హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని ప్రధాని మోదీ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని, నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. 

వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవమని అన్నారు. ITIR ను బెంగళూర్ కు తరలించారనీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారని , ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ గారు? అని ప్రశ్నించారు.

అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లిందని విమర్శించారు.  రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదని మండి పడ్డారు.

అలాగే.. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీ వ్యవహరంలో బండి సంజయ్  ప్రధాన కుట్రదారుడు, సూత్రధారి అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహరంలో సంజయ్‌ అడ్డంగా దొరికిపోయినా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌,సీఎం కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొలేని బీజేపీ పసిపిల్లలతో క్షుద్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అసలు బీజేపీ భవిష్యత్‌ తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నదని నిలదీశారు. సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu