చేరికల్లేవు .. తెలంగాణలో ఇది బీజేపీ పరిస్ధితి, ఈటలే చెప్పారు : హరీశ్ రావు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 30, 2023, 10:01 PM IST
Highlights

తెలంగాణలో బీజేపీకి బలం లేదంటూ స్వయంగా ఈటల రాజేందర్ ఒప్పుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి హరీశ్ రావు. బీజేపీలోకి చేరేందుకు ఎవ్వరూ రావడం లేదని రాజేందర్ చేతులు ఎత్తేశారని హరీశ్ అన్నారు. 

బీజేపీలో చేరికలు, ఈటల రాజేందర్‌పై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పని అయిపోయిందని స్వయంగా ఈటలే అన్నారంటూ చురకలంటించారు. బీజేపీలోకి చేరేందుకు ఎవ్వరూ రావడం లేదని రాజేందర్ చేతులు ఎత్తేశారని హరీశ్ అన్నారు. ఆయన చెప్పేది వేదాంతం.. చేసేది రాద్దాంతమని కడుపులో అంతా విషమేనని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు , మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలు బీజేపీలో  చేరడం కష్టమేనని  ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. సోమవారం నాడు  రాజేందర్  మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ తాను  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో  మాట్లాడుతున్నానని  ఆయన  చెప్పారు. ఖమ్మం  జిల్లాలో కాంగ్రెస్ బలంగా  ఉంది, బీజేపీ లేదన్నారు. పొంగులేటి ,జూపల్లి  తనకే రివర్స్  కౌన్సిలింగ్  ఇస్తున్నారని  ఈటల రాజేందర్  చెప్పారు. ఇప్పటివరకు  వారు కాంగ్రెస్ లో  చేరకుండా ఆపగలిగినట్టుగా ఆయన  వివరించారు.  బీజేపీలో  ఈ ఇద్దరూ నేతలు  చేరేందుకు వారికి  కొన్ని  ఇబ్బందులున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.  

ALso Read: నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు: పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై ఈటల

ఖమ్మంలో  ఇప్పటికీ  కమ్యూనిష్టు  ఐడియాలజీ బలంగా  ఉందన్నారు.  దేశానికి  కమ్యూనిష్టు  సిద్దాంతం  నేర్పిన గడ్డ తెలంగాణే అనే విషయాన్ని  ఈటల రాజేందర్ గుర్తు  చేశారు. ఖమ్మంలో  వామపక్షాలు, టీడీపీ సహా  అన్ని పార్టీలున్నాయన్నారు. ప్రియాంకగాంధీని  అప్పట్లో పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కలుస్తారని  తెలిసిందన్నారు. దీంతో   అంతకంటే ముందే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో  చర్చించినట్టుగా  ఈటల రాజేందర్ గుర్తు  చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హరీశ్ రావు స్పందించారు. 


 

click me!