తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖలమంత్రి హరీష్ సీఎంపై ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశ వైద్య చరిత్రలోనే తొలిసారని వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలా ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. గతేడాది తెలంగాణలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటే రికార్డ్... ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలుగొట్టామని అన్నారు. మన రికార్డును మనమే అధిగమించామని హరీష్ రావు అన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించారు. హైదరాబాద్ లోని అధికారిక నివాసం ప్రగతిభవన్ నుండే వర్చువల్ గా తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో ఇది సుదినమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటని అన్నారు. పేద, మద్యతరగతి వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువుల అందించడం... అదే వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలనే కేసీఆర్ సర్కార్ భారీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తోందని అన్నారు. దీంతో తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని... ఇంతటి విజయం సీఎం మార్గనిర్దేశంతోనే సాధ్యమయ్యిందని హరీష్ అన్నారు.
Read More కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో వున్నా ఎంబిబిఎస్ సీట్లలో కేవలం తెలంగాణ వాటానే 43 శాతమని మంత్రి తెలిపారు. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో వున్న ఎంబిబిఎస్ సీట్లు 57శాతం అని అన్నారు. ఇది తెలంగాణ ప్రగతికి నిదర్శనమని అన్నారు.
గతంలో బెంగాల్ ఆలోచిస్తే దేశం ఆచరిస్తుందని అనేవారని... ఇప్పుడు తెలంగాణ ఆలోచిస్తే దేశం ఆచరిస్తుందనే పరిస్థితి వుందన్నారు హరీష్ రావు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటుచేయాలని కేసీఆర్ సంకల్పిస్తే ఇప్పుడు మిగతా రాష్ట్రాలన్ని దాన్ని ఆచరిస్తున్నాయని అన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు ఆ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలో కేసీఆర్ కు తెలుసన్నారు. అద్భుత పాలనతో అతి తక్కువ కాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు పాలనలో తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని హరీష్ రావు అన్నారు.అలాగే అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపారు వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్.