అర్రే.. హరీష్ రావు ఎటు పోయిండు ?

First Published Nov 28, 2017, 1:59 PM IST
Highlights
  • మెట్రో వేడుకలకు హరీష్ దూరం
  • తెలంగాణ పాలక పెద్దలంతా హాజరు
  • హరీష్ ఎటుపోయిండా అని సర్వత్రా చర్చ

దేశంలోనే అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్టును మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పండుగ వాతావరణంలో వేడకలు జరిగాయి. ఆకాశమే హద్దుగా ఏర్పాట్లు జరిగినయ్. అయితే అన్ని బాగానే ఉన్నా..? ఒక విషయంలో మాత్రం వెలితిగా అనిపించింది. అదేంటిదో ఇక్కడ చదవండి.

మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు మధ్యాహ్నం నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయన దిగారు. ఆ సమయంలో ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సాదర స్వాగతం పలికారు. సిఎం కేసిఆర్, గవర్నర్ నర్సింహ్మన్, స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగరర్, ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు కేటిఆర్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు మిగతా మంత్రులంతా ఆహ్వానం పలికే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరితోపాటు తెలంగాణ బిజెపి నేతలు సైతం ఆహ్వానం పలికే కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, కృష్ణంరాజు లాంటి నేతలంతా ఆహ్వానం పలికినవారిలో ఉన్నారు. తర్వాత బిజెపి నేతలతో కొద్దిసేపు మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు మోడీ.

ఇదంతా బాగానే ఉంది కానీ.. తెలంగాణ ఇరిగేషన్ శాఖ, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు మాత్రం ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడలేదు. ఆయన లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మోడీ పర్యటనలో సిఎం కేసిఆర్, ఆయన తనయుడు, ఐటిశాఖ మంత్రి కేటిఆర్ అన్నీ తామై ముందుండి నడిపించారు. మెట్రో రైలులో ప్రయాణించే సమయంలో మంత్రి కేటిఆర్ మోడీ పక్కనే కూర్చుని అన్ని విషయాలను ప్రధానికి వివరించారు. కానీ మంత్రి హరీష్ రావు మాత్రం ఈ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఆయన ఎందుకు రాలేదబ్బా అన్న చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. విమానాశ్రయంలో స్వాగతం పలికే సమయంలో ఆయన కనిపించలేదు. తర్వాత మెట్రో రైలు ప్రయాణం సందర్భంగా కనిపించలేదు. తెలంగాణ మంత్రివర్గం, అధికార వర్గాలు, ప్రముఖులంతా ఉన్నారు కానీ హరీష్ రావే రాలేదు. కారణాలేమున్నా.. హరీష్ రావు రాకపోవడం మాత్రం ఆసక్తికరమైన అంశంగా చెబుతున్నారు. ఆయన ఎక్కడున్నారు? ఎందుకు ఈ మెట్రో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనలేదన్నది తేలాల్సి ఉంది.

ఢిల్లీలో హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు వచ్చిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఢిల్లీకి  వెళ్లారని  సంబంధిత శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సిడబ్ల్యుసీ అనుమతులపై ఉన్నతాధికారులతో భేటి అయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ప్రధాని ఇక్కడికి వస్తున్న సమయంలో ఇంకో రోజున హరీష్ తన ఢిల్లీ టూర్ పెట్టుకునే అవకాశాలు లేవా అన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయి.

click me!