పాత అవతారమెత్తిన హరీష్ రావు... ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలన

By Arun Kumar PFirst Published Apr 18, 2020, 2:02 PM IST
Highlights

సిద్దిపేట జిల్లా పరిధిలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు. 

సిద్ధిపేట: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు చాలారోజుల తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించారు. గతంలో ఆయన ఇరిగేషన్ మంత్రిగా వున్న సమయంలో నీటిపారుదల ప్రాజెక్టులను పరుగెత్తించారు. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక ఆ శాఖ పనులకే పరిమితమయ్యారు. కానీ తాజాగా తన నియోజకవర్గ పరిధిలో సాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులను  పరిశీలిస్తూ పాత రోజులను గుర్తుచేశారు. 

సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని రంగనాయక సాగర్ ప్రధాన కుడి కాలువ వెంట గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలను కాల్వల ద్వారా నింపేందుకు అనువైన స్థలాల భూ సేకరణకు కావాల్సిన ప్రాంతాల స్థితిగతులపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఆరా తీశారు. పుష్కలమైన నీటి వనరులతో గ్రామీణ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు. 

నంగునూరు మండలంలోని గ్రామాలు, సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, నర్సాపూర్, లింగారెడ్డిపల్లి గ్రామ రైతులకు వ్యవసాయ పొలాల వద్ద తూములు కట్టించుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. నేరుగా మంత్రే రైతులకు అవగాహన కల్పించారు. కాల్వలతో చెరువులు, కుంటలు నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు.  

click me!