
నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు ఒరిగింది ఏం లేదన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పెరిగిందన్నారు. తప్పులు, అప్పులు చేయడం కేంద్రానికి అలవాటేనని హరీశ్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, దాని అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విఫలమైనట్లు స్వయంగా కేంద్రమే ఒప్పుకుందని హరీశ్ రావు గుర్తుచేశారు. చలామణిలో వున్న నగదుపై కేంద్రం చెప్పేవి అన్ని అబద్ధాలేనని.. దొంగనోట్ల సంఖ్య 54 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ చెప్పిందన్నారు మంత్రి హరీశ్ రావు.
ప్రస్తుత దేశ జీడీపీలో 13 శాతానికి పైగా నగదు చెలామణిలో వుందని.. పెద్ద నోట్ల వాడకం పరిమితం కాకపోగా, రెట్టింపు అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. డీమానిటైజేషన్ లక్ష్యాలు నెరవేరలేదని.. ప్రధాని మోడీ అంటోన్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఒక పెద్ద జోక్ అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు సమయంలో కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్ద క్యూలైన్‌లో నిలబడి 108 మంది చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం ఆర్‌బీఐ రూ.21 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారని.. తొమ్మిదేళ్ల కాలంలో బీజేపీ 100 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.