తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన 9 మంది నిందితులను మంగళవారంనాడు నాంపల్లి కోర్టులో హజరుపర్చారు పోలీసులు. ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన రెండు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.
ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను వాయిదా వేశారు.ఈ రెండు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయా లేదా అనే విషయమై నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకే్ విషయానికి సంబంధించి అరెస్టైన 9 మంది నిందితులను పోలీసులు మంగళవారంనాడు నాంపల్లి కోర్టులో హజరుపర్చారు. కోర్టులో హాజరపర్చడానికి ముందుగా నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రవీణ్ కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ లు సెక్షన్ అధికారి కంప్యూటర్ నుండి ప్రశ్నాపత్రాన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్నారు.ఈ ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్ రేణుకకు పంపారు. రేణుక ఈ ప్రశ్నాపత్రాన్ని మరికిందరికి షేర్ చేసింది. ఈ విషయంలో సుమారు రూ. 14 లక్షలు చేతులు మారినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే అంతకుముందు నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కూడా లీకైందా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ విషయమై శాస్త్రీయంగా నిర్ధారించుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు గాను ప్రవీణ్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఈ నెల 25వ తేదీ తర్వాత రానుంది. ఈ రిపోర్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించనున్నారు.
also read:టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ .. తెలంగాణ సర్కార్ సీరియస్, వివరణ ఇవ్వాల్సిందిగా కమీషన్‌కు ఆదేశం
మరో వైపు ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నిందితులను కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేకపోలేదు.