పవన్‌తో పొత్తులు .. కిరణ్‌తో సలహాలు, ఇదేనా మీ ఆత్మగౌరవం : ఈటల రాజేందర్‌పై హరీశ్‌రావు ఆగ్రహం

Siva Kodati |  
Published : Nov 10, 2023, 05:13 PM IST
పవన్‌తో పొత్తులు .. కిరణ్‌తో సలహాలు, ఇదేనా మీ ఆత్మగౌరవం : ఈటల రాజేందర్‌పై హరీశ్‌రావు ఆగ్రహం

సారాంశం

బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీకి, ఈటల రాజేందర్‌కు ముఖ్య సలహాదారుడని మంత్రి ఎద్దేవా చేశారు.   

బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హుజురాబాద్‌లో ఆయన ప్రసంగిస్తూ.. ఈటల రాజేందర్ తెలంగాణ ఆత్మగౌరవం ఏమైపోయిందని ప్రశ్నించారు. పదవుల కోసం ఆయన ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టారని హరీశ్ దుయ్యబట్టారు. అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీకి, ఈటల రాజేందర్‌కు ముఖ్య సలహాదారుడని మంత్రి ఎద్దేవా చేశారు. 

తెలంగాణ వస్తే తాను కొన్నిరోజులు నిద్రాహారాలు మానేశానన్న పవన్ కళ్యాణ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుందని హరీశ్‌రావు మండిపడ్డారు. పదవుల కోసం సమైక్యవాదులతో ఈటల రాజేందర్ చేతులు కలిపారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఏం చేసినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదని హరీశ్‌రావు జోస్యం చెప్పారు. బీజేపీకి ఓటేస్తే గ్యాస్ సిలిండర్‌ను రూ.2000 వేలు చేస్తారని మంత్రి ఎద్దేవా చేశారు. సిలిండర్‌ను రూ.400కే ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని హరీశ్ గుర్తుచేశారు. 

ఇచ్చిన ప్రతి మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని.. ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్‌దే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే రూ.5 వేలు పెన్షన్ ఇస్తామని హరీశ్ పేర్కొన్నారు. మాట ఇవ్వకపోయినా కేసీఆర్ రైతుబంధు పథకాన్ని కేసీఆర్ తెచ్చారని తెలిపారు. సౌభాగ్య లక్ష్మీ పేరుతో మహిళలకు రూ.3 వేలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మోసపోతే గోస పడతామని.. రేషన్ కార్డు వున్నవారికి సన్నబియ్యం ఇస్తామని హరీశ్ తెలిపారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ఆరోగ్య బీమా అందజేస్తామని చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?