తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే జరిగేదిదే...: మంత్రి హరీష్ ఆందోళన

Arun Kumar P   | Asianet News
Published : Jun 08, 2022, 05:14 PM IST
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే జరిగేదిదే...:  మంత్రి హరీష్ ఆందోళన

సారాంశం

బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నాయి...మరి వాళ్లు పాలించే రాష్ట్రాల్లో చేయడం లేదెందుకో అంటూ ఆర్థిక మంత్రి నిలదీసారు. 

నర్పాపూర్: కేంద్ర ప్రభుత్వం తీరుచూస్తుంటే మాటలు తెలంగాణకు‌-మూటలు గుజరాత్ కు అన్నట్లుగా వుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు (harish rao) అన్నారు. ఇతర రాష్ట్రాలకు ప్రకటించిన వాటిని కూడా ప్రధాని మోదీ (narendra modi) సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలిస్తున్నారని... ఇటీవల తెలంగాణలో పెడతామన్న గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ కూడా అలాగే తరలించారన్నారు. కేంద్ర కిషన్ రెడ్డి హైదరాబాద్ లో పెడతామని ట్విట్టర్లో ప్రకటించిన తర్వాత దాన్ని గుజరాత్ లో పెట్టారన్నారు. చివరకు విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ లో కాకుండా గుజరాత్ కు తరలించారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

నర్పాపూర్ లో ఆర్టిసి డిపోను రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి హరీష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో హరీష్ మాట్లాడుతూ... నర్పాపూర్ ప్రజల మూడు దశాబ్ధాల కలను నిజం చేసిన ఘనత ఎమ్మెల్యే మదన్ రెడ్డిది అన్నారు. ధర్నాలు, నిరహార దీక్షలు, రాస్తారోకోలు ఎన్నో ఆర్టీసీ డిపో కోసం జరిగాయి... అలాంటి కల నిజం అయిందన్నారు. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి ఆర్టీసీ డిపోను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని... కరోనా రాకపోతే రెండేళ్ల క్రితమే డిపో పూర్తయ్యేదన్నారు. .

''కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏది అమ్ముదమా అని చూస్తున్నారు. రైల్వేలు, రైల్వేస్టేషన్లు,  విశాఖ ఉక్కు అన్ని అమ్ముతున్నారు. వాళ్లు అమ్ముడే కాకుండా రాష్ట్రాలకు పోటీ పెట్టారు. మీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే రూ.2 వేల కోట్ల బహుమానం ఇస్తామన్నారు. బీజేపీ పరిపాలన ఎలా ఉందంటే బావుల కాడ, బాయిల కాడ మీటర్లు పెడితే రూ.25 వేల కోట్లు  ఇస్తారంట, ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే రూ.2 వేల కోట్లు ఇస్తారంట. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం పని చేయాలి. కాని బీజేపీ ప్రభుత్వం వ్యాపారధోరణితో పని చేస్తుంది. ఎలా లాభాలు సంపాదించాలని చూస్తోంది'' అని మండిపడ్డారు. 

''బీజేపీని అడుగుతున్నా... అసలు మీ పాలసీ ఏంటి. ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు. రేపు రాష్ట్రంలోకి బీజేపి వస్తే ఆర్టీసీని కూడా అమ్ముతారు. ఆరు గంటల కరెంటే గంటకు గంటకు ట్రిప్ అవుతదంట పక్కన బిజెపి అధికారంలో వున్న కర్ణాటకలో. వాళ్లు తెలంగాణలో భూములు కొని కర్ణాటక బోర్డర్ కు నీళ్లు పారించుకుంటున్నారు. వీళ్ళది డబులు ఇంజన్ అంట... మరి కర్ణాటకలో బీజేపీ. కేంద్రంలో బీజేపీ. డబుల్ డెక్కర్ ప్రభుత్వం సక్కగా ఉంటే... తెలంగాణలోకి పైపులు వేసి కర్ణాటకలోని భూములకు నీళ్లు పెట్టుకుంటున్నారెందుకో'' అంటూ హరీష్ ఎద్దేవా చేసారు. 

''బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి లేదు. రైతు బంధు లేదు. కాంగ్రెస్ వాళ్లు బాగా మాట్లడుతున్నారు. అధికారం ఇస్తే మేం ఏదో చెస్తమంటున్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎరువు బస్తా కోసం పోలీస్ స్టేషన్ల ముందు లైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంది.  కర్ణాటకలో 500 పెన్షన్, మన దగ్గర రెండు వేల రూపాయల పెన్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ లో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. సాగు నీళ్లు లేవు'' అంటూ బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల పాలనపై మండిపడ్డారు. 

''ఏడేళ్లలో నర్సాపూర్ ఎంత అభివృధ్ది చెందిందో చూడండి. బస్సు డిపో, డీఎస్పీ ఆఫీసు నర్సాపూర్ కు వచ్చింది. హల్దీ, మంజీర మీద 15 చెక్ డాంలు కట్టాం.  70 ఏళ్లలో మంజీర మీద ఒక్క చెక్ డాం కట్టలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక 150 కోట్లతో 15 చెక్ డాంలు కట్టాం'' అని మంత్రి తెలిపారు. 

''వడ్లు కొంటలేదని సెంటర్లకు వెళ్లి డ్రామలు చేశారు. ఒకరు పాదయాత్ర, ఇంకొకరు మోకాళ్ల యాత్ర. కానీ 300 కోట్ల రూపాయలతో వడ్లు కొన్నం. ఆ డబ్బులు రైతుల అక్కొంట్లలో పడ్డాయి. కర్ణాటక వడ్లు దొడ్డి దారిన తెలంగాణకు తెచ్చి 1900 రూపాయలకు అమ్ముతున్నారు.  బీజేపీ వాళ్లు జోరుగా మాట్లాడారు. మరి అక్కడి వడ్లు ఇక్కడికి ఎందుకు తెచ్చి అమ్ముతున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతున్నారు. మీరు పాలిస్తున్న చత్తీస్ ఘడ్ లో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నరా... రైతు బంధు ఇస్తున్నరా... అక్కడ ఎందుకు ఇవ్వడం లేదు.  ఏదంటే అదే  ఇస్తమని కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలను మోసం చేద్దామన్న ధోరణితో ఉన్నారు. మీరు ఇచ్చే వాళ్లు అయితే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు'' అంటూ హరీష్ రావు నిలదీసారు. 

 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?