Huzurabad Bypoll: నా భరతం పడితే నీకేం వస్తుంది ఈటల...: మంత్రి హరీష్ కౌంటర్

By Arun Kumar PFirst Published Sep 14, 2021, 2:21 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతను చేపట్టిన మంత్రి హరీష్ రావు, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. 

కరీంనగర్: భరతం పడతానంటూ మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందించారు. నా భరతం పాడతానని ఈటల బెదిరిస్తున్నాడు... అయినా నా భారతం పడితే నీకేం వస్తుంది. ఇలా బెదిరిస్తే ఓట్లు రాలవు.. మీరు చేసే పనుల వల్ల ఓట్లు వస్తాయి అని హరీష్ పేర్కొన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇళ్ళంతకుంట మండల కేంద్రంలో రూ.27లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎల్లమ్మ గుడికి మంత్రి హరీష్ శంకుస్థాపన చేశారు. అనంతరం గౌడ కులస్థుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... బిజెపి నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బెదిరింపులకు పాల్పడితే ఎవరు హర్షించరని... ప్రేమతో చోటు సంపాదించుకోవాలని మంత్రి సూచించారు. 

''గత ప్రభుత్వాలు మద్యం ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశ్యంతో కల్లు డిపోలను బంద్ చేశాయి. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కళ్ళు డిపోలు పునరుద్ధరించాం. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకున్నాం'' అని హరీష్ అన్నారు. 

''గతంలో 2 ఏళ్లకోసారి కల్లుడిపోల లైసెన్సుల పునరుద్ధరణ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దీన్ని పదేళ్లకు పెంచాం. కల్లు ఆరోగ్యానికి మంచిదని భావించి.. హైదరాబాద్ లో నీరా షాపులు ఓపెన్ చేస్తున్నాం. కరోనా రాకపోతే ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రారంభించేవాళ్లం'' అన్నారు.

 ''50 ఏళ్లకే గీతకార్మికులకు 2016 రూపాయల ఫించన్ ఇస్తున్నాం. ముదిరాజ్ లకు ఇచ్చినట్లుగా గీతకార్మికులకు లూనా(మోపెడ్)లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా తీసుకురాబోతున్నాం. ఇదే తరహాలో మత్స్య, చేనేత కార్మికుల బీమా కూడా తేవాలని సీఎం ఆలోచిస్తున్నారు'' అని హామీ ఇచ్చారు.

Read more  Huzurabad Bypoll: మిస్టర్ హరీష్.. తప్పకుండా నీ భరతం పడతా: ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

''పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా ఈత, తాటి వనాలు పెంచుతున్నాం. ఇన్ని మీకోసం మా ప్రభుత్వం చేస్తుంటే.. ఎందుకు బీజేపీకి ఓటేయాలి? కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే పట్టించుకోవడం లేదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని, బీసీ జనాభా గణన చేయాలని అడిగితే స్పందించడం లేదు. కానీ కేరళ మంత్రి మురళీధరన్ ను ఇక్కడికి తీసుకువచ్చి మీ గౌడన్నను తెచ్చాం.. ఓటేయండి అని అడుగుతున్నారు. ఆయన మీటింగ్ కు మీరు కూడా వెళ్లారు కదా... మీకోసం ఒక్క హామీ అయినా ఆ కేంద్రమంత్రి  ఇచ్చాడా?'' అని హరీష్ అడిగారు. 

''మీరు కూడా తిన్న రేవు మరవకుండా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి. మాయమాటలు, మొసలి కన్నీరుతో మీకేం లాభం లేదు. బీజేపీవాళ్లు ఇక్కడ ఏం చేస్తారో చెప్పకుండా.. బెదిరింపులకు, దాదాగిరీలకు దిగుతున్నారు. కొమురెల్లి గౌడ్  ఇంటికి వెళ్లి మీ గౌడ కులస్థులకు అన్ని చేసాం.. పనిచేసేవాళ్లను కాపాడుకోవాలని నేను అడిగితే సరే అన్నా.. అంటూ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. కొమురెల్లి ఇంటికి వెళ్లి సర్ది చెప్పిన తర్వాతే అర్థం చేసుకుని వచ్చాడు'' అని హరీష్ వివరించారు. 

''సొంత ఇంటి స్థలం ఉన్నవాళ్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాం. నాలుగు వేల ఇండ్లు మంజూరు చేస్తే.. ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఆ బాధ్యత మేం తీసుకుంటాం. ఇంకా రెండున్నరేళ్లు మేమే ఉంటాం.. ఎండమావిలాంటి బీజేపీ వైపు వెళ్లేబదులు... అధికారంలో ఉన్న మాకు మద్ధతునీయండి'' అని మంత్రి హరీష్ గౌడ కులస్తులను కోరారు. 
 

click me!