మానవత్వమున్న మహా మనిషి కేసీఆర్... అందువల్లే గొప్ప సంకల్పం: మంత్రి గంగుల

By Arun Kumar PFirst Published Jul 26, 2021, 4:22 PM IST
Highlights

భూపాలపల్లి జిల్లాలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను అందించాారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. 

వరంగల్: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో సీఎం కేసిఆర్ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి గంగుల లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... మొదటిసారి జిల్లాకు ఇలాంటి గొప్ప కార్యక్రమానికి రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్న ఈ గడ్డ మీద నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని సీఎం కేసిఆర్ సూచించినట్లు తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నది ఈ రోజు ప్రారంభించుకుంటున్నామని గంగుల అన్నారు.

''మానవత్వం ఉన్న మహా మనిషి సీఎం కేసిఆర్ గారు కాబట్టే వెనుకబడిన కులాలు అందరితో సమానంగా నేడు ముందుకు వెళ్తున్నాయి. 4,15,000 మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. 3,09,082 మందికి  పంపిణీ చేసుకుంటున్నాం. 8 లక్షల మంది లబ్దిదారులు ఆగస్టు నుంచి ఒక్కొక్కరు 6 కిలోల బియ్యం తీసుకుంటారు'' అని తెలిపారు.  

''ఒకప్పుడు మన దగ్గర పంట పండక, బియ్యం లేక పంజాబ్ నుంచి తెచ్చుకునే వాళ్ళం. అక్కడి నుంచి రావడం ఆలస్యం అయితే బియ్యం ముక్కపడితే పారబోసేవాళ్ళం. కానీ నేడు మన దగ్గర వచ్చే నాణ్యమైన బియ్యాన్ని రేషన్ ద్వారా ఇచ్చుకుంటున్నాం. ఒక్కటే రోజు 3, 09, 082 మందికి కార్డులు ఇవ్వడం దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం కేసిఆర్ గారు ఈ కార్యక్రమం జరగాల్సిందేనని అన్నారు. గతంలో ఒక్కో కార్డు ఇవ్వాలంటే ఎంతో ఫైరవి చేయాల్సి వచ్చేది. కానీ నేడు ఏ ఒక్కరి పైరవీ లేకుండా నేరుగా లబ్ధిదారులకు కార్డులు ఇచ్చుకుంటున్నాం'' అని పేర్కొన్నారు. 

read more  తెలంగాణలో ప్రారంభమైన కొత్త రేషన్‌కార్డుల పంపిణీ..

''గతంలో అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి అంటే ఎండిపోయిన నార్లు, కాలిపోయిన మోటార్లు పట్టుకుని వెళ్ళే వాళ్ళం. కానీ నేడు అలాంటి పరిస్థితి ఉందా? దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం వచ్చాక భూమి ఏమైనా పెరిగిందా? లేదు. అయినా పంట పెరిగింది. సీఎం కేసిఆర్ రైతుకు కావాల్సినవన్నీ ఇస్తూ వ్యవసాయాన్ని పండగ చేస్తున్నారు. అందువల్ల దిగుబడి గణనీయంగా పెరిగింది'' అని వెల్లడించారు. 

''గతంలో నీళ్ళు లేక, కరెంట్ రాక, పెట్టుబడి దొరకక రైతు నానా గోస పడ్డాడు. ఈరోజు రైతు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నాడు. నీటికోసం మొగులు చూడడం లేదు...గుండెలు నిండెలా చెరువులు నిండు కుండల్లా ఉన్నాయి. కరెంట్ కష్టం లేదు. పెట్టుబడి బాధ పోయింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి  తీసుకొచ్చారు. అన్నపూర్ణగా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నేడు దేశంలో, ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది అంటే అది కేసిఆర్ నాయకత్వం వల్లే'' అన్నారు.

''నా చిన్నతనంలో ఆడపిల్ల పెరుగుతుంది అంటే తల్లిదండ్రులకు పెళ్లి కోసం భయం అయ్యేది. కట్నం ఎలా ఇవ్వాలనే దిగులు ఉండేది. కానీ సీఎం కేసిఆర్ పాలనలో కట్నం ఇచ్చి పెళ్లి చేసే విధంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ తెచ్చి పేద వాళ్ళింట్లో పెళ్లి భారం తప్పించారు. కాన్పుకు బిడ్డని ఇంటికి తీసుకొస్తే అప్పు చేయాల్సి వస్తుందని గమనించిన కేసిఆర్ కిట్ తెచ్చి తల్లిదండ్రుల చేతిలో మనమరాలిని పెడుతున్నారు. పెరిగిన మనమరాలి చదువు కోసం గురుకులాలు పెట్టీ నాణ్యమైన విద్య అందిస్తూ మంచి పోషకాహారాన్ని పెడుతున్నారు. ఒకప్పుడు 9 వేల మంది బీసీ బిడ్డలు గురుకులాల్లో ఉంటే నేడు లక్షా 50 వేల మంది బీసీ బిడ్డలు గురుకులాల్లో చదువుతున్నారు'' అని గంగుల తెలిపారు.  
 
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, జక్కుల శ్రీహర్షిని, పుట్ట మధు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.
 

click me!